ఛేజింగ్‌లో చతికిలపడ్డ షాన్ మసూద్ బృందం
రెండో ఇన్నింగ్స్‌లో 163 ఆలౌట్
నహీద్ రాణాకు ఐదు వికెట్లు
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి 13 టెస్టుల్లో పాకిస్తాన్ 12 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. ఆ తర్వాత పాకిస్తాన్ విజయపరంపరకు 2024లో రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తెరదించింది. ఆనాడు రెండు వారాల్లో వరుసగా రెండు టెస్టుల్లో పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ భళా అనిపించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో వరుసగా మూడోసారి బంగ్లాదేశ్ జట్టే పైచేయి సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మిర్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 103 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 16 నుంచి సిల్హెట్‌లో జరుగుతుంది.
ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 152/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 70.3 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ కెపె్టన్ నజు్మల్ హుస్సేన్ షంటో (87; 7 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోమినుల్ హక్ (56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, నోమన్ అలీ 3 వికెట్ల చొప్పున తీశారు.
అనంతరం బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన పాకిస్తాన్ 52.5 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా ఫజల్ (66; 11 ఫోర్లు) ఒక్కడే క్రీజులో నిలబడి అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. తస్కిన్ అహ్మద్, తైజుల్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. ఆఖరి రోజు 16 వికెట్లు పడటం విశేషం. మ్యాచ్‌లో 188 పరుగులు చేసిన షంటోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు... పాకిస్తాన్ 386 పరుగులు చేశాయి.


