
PC: BCCI/IPL.com
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు మొదలు పెట్టింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారత క్రికెట్ బోర్డు సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మే 15 లేదా మే 16న ఐపీఎల్ మ్యాచ్‌లు మళ్లీ మొదలయ్యే అవకాశముంది.
అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ పునఃప్రారంభమవుతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ గాయం కారణంగా ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. హాజిల్ వుడ్ ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలోనే మే 3న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. అయితే అతడు జట్టుతో పాటు ఉండడంతో తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ అంతలోనే బీసీసీఐ ఐపీఎల్‌ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో హాజిల్‌వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో అతడు తిరిగి భారత్‌కు వచ్చే సూచనలు కన్పించడం లేదు. జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతడిని తిరిగి పంపకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.
ఈ ఏడాది సీజన్‌లో హాజిల్‌వుడ్ 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ నిలిచే సమయానికి అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌గా ఉన్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా తిరిగి వచ్చేది అనుమానమే. కాగా ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ దుమ్ములేపుతోంది. 11 మ్యాచులలో 8 విజయాలు సాధించి.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది.
చదవండి: #Virat Kohli: మనసు మార్చుకోని కోహ్లి.. త్వరలోనే రిటైర్మెంట్?