బాబర్‌ ఆజం ప్రపంచ రికార్డు | Babar Azam achieves major batting record this decade | Sakshi
Sakshi News home page

బాబర్‌ ఆజం ప్రపంచ రికార్డు

May 18 2026 8:38 AM | Updated on May 18 2026 8:58 AM

Babar Azam achieves major batting record this decade

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2020 దశకంలో అంతర్జాతీయ క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సిల్హెట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో  జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు.

ఈ దశకంలో (2020 నుంచి) బాబర్‌ ఇప్పటివరకు 212 మ్యాచ్‌లు ఆడి 231 ఇన్నింగ్స్‌ల్లో 9060 పరుగులు చేశాడు. అతని సగటు 42.53 కాగా, 17 సెంచరీలు, 67 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌ ఉన్నాడు. రూట్‌ 120 మ్యాచ్‌ల్లో 8305 పరుగులు చేశాడు. రూట్‌ వన్డేలు, టీ20లు తక్కువగా ఆడటం వల్ల బాబర్‌ కంటే వెనుకబడ్డాడు.

ఈ దశకంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్‌ వికెట్‌కీపర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 7779 పరుగులు చేశాడు. శ్రీలంక ఆటగాళ్లు కుసాల్‌ మెండిస్‌, పథుమ్‌ నిస్సంక వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

భారత్‌ తరఫున తొలి ఐదుగురిలో ఒక్క ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. విరాట్‌ కోహ్లి 6771 పరుగులతో ఆరో స్థానంలో ఉండగా, శుభ్‌మన్‌ గిల్‌ 6649 పరుగులతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ శర్మ 6391 పరుగులతో టాప్‌-10లో (పదో స్థానం) చోటు దక్కించుకున్నాడు.

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో పాక్‌ తడబడుతోంది. ఇప్పటికే తొలి టెస్ట్‌ కోల్పోయిన ఆ జట్టు మరో ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన బంగ్లాదేశ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్‌ చేస్తుంది. 

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి 156 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 278 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 232 పరుగులకే కుప్పకూలింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement