ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గిన తొలి అన్‌సీడెడ్ ప్లేయర్‌గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్‌ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్‌షిప్ సాధించిన అన్‌సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్‌ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.
ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను.
నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్‌లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు.


