ఆనందం ఆస్ట్రేలియాదే...

Australia Victory over India in the third Test - Sakshi

మూడో టెస్టులో భారత్‌పై విజయం

డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ అర్హత

18.5 ఓవర్లలోనే ముగిసిన లాంఛనం 

9 నుంచి అహ్మదాబాద్‌లో చివరి టెస్టు  

ఆ్రస్టేలియా ముందు అతిస్వల్ప విజయలక్ష్యం... అయినా సరే గత టెస్టులో 18 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు, ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు తీసిన తీరును బట్టి భారత శిబిరంలో ఏదో ఒక మూల కాస్త ఆశ, నమ్మకం... అందుకు తగినట్లుగానే ఇన్నింగ్స్‌ రెండో బంతికే వికెట్‌ కూడా దక్కింది. అయితే ఆపై ఆసీస్‌ ఎక్కడాతడబడలేదు. హెడ్, లబుషేన్‌ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ పోయారు. డిఫెన్స్‌ ఆడి ఉత్కంఠ పెంచకుండా ఓవర్‌కు 4.14 రన్‌రేట్‌తో పరుగులు చేస్తూ మ్యాచ్‌ను వేగంగా ముగించేశారు. ప్రత్యర్థిని స్పిన్‌ గోతిలో పడేయబోయిన భారత్‌ చివరకు అదే వ్యూహానికి చిక్కి మ్యాచ్‌ను చేజార్చుకుంది.

రెండు టెస్టులు ఓడి నిస్సహాయంగా కనిపించిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా పుంజుకొని చెప్పుకోదగ్గ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అధికారికంగా ఆస్ట్రేలియా అర్హత సాధించింది. భారత్‌ కూడా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే చివరిదైన నాలుగో టెస్ట్‌లో ఆసీస్‌పై గెలవాలి. ఒకవేళ మ్యాచ్‌ ‘డ్రా’ అయినా, భారత్‌ ఓడిపోయినా టీమిండియా ఫైనల్‌ అవకాశాలు న్యూజిలాండ్‌–శ్రీలంక టెస్ట్‌ సిరీస్‌ తుది ఫలితంపై ఆధారపడి ఉంటాయి. 

ఇండోర్‌: బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో ఆ్రస్టేలియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. శుక్రవారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఆ్రస్టేలియా 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. సిరీస్‌లో భారత్‌ టీమిండియా ఆధిక్యాన్ని 2–1కి తగ్గించింది. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బరిలోకి దిగిన ఆసీస్‌ 18.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 78 పరుగులు చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (53 బంతుల్లో 49 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), లబుషేన్‌ (58 బంతుల్లో 28 నాటౌట్‌; 6 ఫోర్లు) జట్టును గెలిపించారు. నాథన్‌ లయన్‌ (11/99) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. సిరీస్‌లో చివరి టెస్టు ఈనెల 9 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. 

ప్రత్యర్థిని కుప్పకూల్చేందుకు స్పిన్‌ తప్ప మరో మార్గం లేదని భావించిన భారత్‌ మరో ఆలోచన లేకుండా అశ్విన్‌తోనే బౌలింగ్‌ మొదలు పెట్టింది. దానికి తగిన ఫలితం కూడా అందుకుంది.  రెండో బంతికే తడబడిన ఉస్మాన్‌ ఖాజా (0) కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో టీమిండియా ఆశలు మరింత పెరిగాయి. అయితే హెడ్, లబుõÙన్‌ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి 10 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు 13 పరుగులే. ఈ దశలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

బంతి సీమ్‌ దెబ్బ తినడంతో అంపైర్లు బంతిని మార్చాల్సి వచ్చింది. భారత బృందం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినా అదే బంతితో బౌలింగ్‌ చేయక తప్పలేదు. అశ్విన్‌ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టి హెడ్‌ జోరు పెంచగా, జడేజా తర్వాతి ఓవర్లో లబుõÙన్‌ రెండు ఫోర్లు కొట్టాడు. అశ్విన్‌ మరో ఓవర్లో మళ్లీ రెండు ఫోర్లు రాబట్టి వీరిద్దరు 15 ఓవర్లలో స్కోరును 56/1కు చేర్చారు.  డ్రింక్స్‌ తర్వాత 23 బంతుల్లో 22 పరుగులు రాబట్టి కంగారూలు విజయాన్ని అందుకున్నారు.  

స్కోరు వివరాలు: భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 109; 
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 197; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 163; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌: ఖాజా (సి) భరత్‌ (బి) అశ్విన్‌ 0; హెడ్‌ (నాటౌట్‌) 49; లబుషేన్‌ (నాటౌట్‌) 28; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 78. వికెట్ల పతనం: 1–0. బౌలింగ్‌: అశ్విన్‌ 9.5–3–44–1, జడేజా 7–1–23–0, ఉమేశ్‌ 2–0–10–0. 

పిచ్‌ ‘నాసిరకం’ 
మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్ఛిన ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ‘నాసిరకం పిచ్‌’గా గుర్తిస్తూ మూడు డీమెరిట్‌ పాయింట్లు శిక్షగా విధించింది. మూడో రోజు తొలి సెషన్‌లోపే ఈ టెస్టు ముగిసింది. ‘పొడిగా ఉన్న ఈ పిచ్‌పై బంతికి, బ్యాట్‌కు మధ్య సమతుల్యత లోపించింది. మ్యాచ్‌ ఐదో బంతికే దుమ్ము రేగగా, ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది’ అని మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ నివేదిక ఇచ్చారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top