IND Vs PAK Asia Cup 2022: ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్‌ విజయం

Asia Cup 2022: Ind Vs Pak Live Score Updates-Latest News And Highlights - Sakshi

ఆదివారం ఆసియా కప్‌ టి20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థుల మధ్య ఉత్కంఠగా జరిగింది. చివరకు భారత్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. మొదట పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (42 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. సీమర్లు భువనేశ్వర్‌ (4/26), హార్దిక్‌ పాండ్యా (3/25) పాక్‌ను కట్టడి చేశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలిచింది. కెరీర్‌లో 100వ టి20 మ్యాచ్‌ ఆడిన కోహ్లి (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన పరుగులు జతచేస్తే... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు.

16 ఓవర్లలో టీమిండియా 107/4
►16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానకి 107 పరుగులు చేసింది. జడేజా 21, పాండ్యా 11 పరుగులతో ఆడుతున్నారు.

14 ఓవర్లలో టీమిండియా స్కోరెంతంటే?
►టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా ఇన్నింగ్స్‌ను జడేజా, సూర్యకుమార్‌లు చక్కదిద్దే పనిలో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లు ముగిసేసరికి 89 పరుగులు చేసింది. జడేజా 18, సూర్యకుమార్‌ యాదవ్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లి(35) ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
►కెరీర్‌లో వందో టి20 మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. సెంచరీ చేస్తాడనుకుంటే 34 బంతుల్లో 35 పరుగులు చేసి మహ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌లో ఇఫ్తికర్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. జడేజా 8, సూర్యకుమార్‌ 1 పరుగుతో క్రీ,జులో ఉన్నారు.

రోహిత్‌ శర్మ(12) ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
►పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. మహ్మద్‌ నవాజ్‌ బౌలింగ్‌లో ఇఫ్తికర్‌ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

5 ఓవర్లలో టీమిండియా 29/1
► 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి 24, రోహిత్‌ శర్మ 4 పరుగులతో పరుగులతో ఆడుతున్నారు. 

కేఎల్‌ రాహుల్‌ గోల్డెన్‌ డక్‌.. తొలి వికెట్‌ డౌన్‌
► 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. నసీమ్‌ షా బౌలింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. తద్వారా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్కోరు వికెట్‌ నష్టానికి 1 పరుగు చేసింది.

పాకిస్తాన్‌ 147 ఆలౌట్‌.. టీమిండియా టార్గెట్‌ 148

► టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 19.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్‌ అయింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఇప్తికర్‌ అహ్మద్‌ 28 పరుగులు చేశాడు. చివర్లో షానావాజ్‌ దవాని 6 బంతుల్లో 16 పరుగులు, హారిస్‌ రౌఫ్‌ 7 బంతుల్లో 13 పరుగులు చేయడంతో పాకిస్తాన్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ 4, హార్దిక్‌ పాండ్యా 3, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2, ఆవేశ్‌ ఖాన్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఏడో వికెట్‌ డౌన్‌.. పాక్‌ స్కోరెంతంటే?
► టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మహ్మద్‌ నవాజ్‌(1) కీపర్‌ కార్తిక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో పాక్‌ ఏడో వికెట్‌​కోల్పోయింది. అంతకముందు 9 పరుగులు చేసిన ఆసిఫ్‌ అలీ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పాకిస్తాన్‌ 112 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. 

పాండ్యా దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
► టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పాకిస్తాన్‌ దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. తొలుత మంచి ఫామ్‌లో ఉన్న మహ్మద్‌ రిజ్వాన్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించిన పాండ్యా.. ఆ తర్వాత 2 పరుగులు చేసిన కుష్‌దిల్‌ను పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది.

మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
► టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన​ మూడో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో 28 పరుగులు చేసిన ఇఫ్తికర్‌ అహ్మద్‌ కీపర్‌ కార్తిక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది.

10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్‌ 68/2
► 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్‌ 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 29, ఇప్తికార​ అహ్మద్‌ 16 పరుగులతో ఆడుతున్నారు.

ఫఖర్‌ జమాన్‌(10) ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
► టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఫఖర్ జమాన్‌ ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో కీపర్‌ కార్తిక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ 20 పరుగులతో ఆడుతున్నాడు.

► ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఉత్కంఠగా కొనసాగుతోంది. అయిదు ఓవర్లు పూర్తయే సరికి పాకిస్తాన్‌ ఒక వికెట్‌ నష్టపోయి.. 30 పరుగులు చేసింది.  క్రీజ్‌లో రిజ్వాన్‌తోపాటు, ఫఖర్‌ జమాన్‌ ఉన్నారు

తొలి వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
మ్యాచ్‌ ఆరంభంలోనే పాకిస్తాన్‌కు షాక్‌ తగిలింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 15 పరుగుల వద్ద బాబర్‌ ఆజమ్‌(10) షాట్‌కు ప్రయత్నించి అర్ష్‌దీప్‌ చేతికి చిక్కాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి పాక్‌ స్కోర్‌ 19/1. క్రీజ్‌లో రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌ ఉన్నారు.

►   టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఒక ఓవర్‌ ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. బాబర్‌ ఆజం 5, రిజ్వాన్‌ 1 పరుగుతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా
► భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే అభిమానుల దృష్టిలో అదో పెద్ద సమరం. యుద్ధానికి ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా ఉండే వాతావరణం. ఎవరితో ఓడినా ఇక్కడ మాత్రం ఓడరాదనే కసి... నాటి ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దూసుకుపోవడం, మాటల తూటాలు పేలుతుంటాయి. మరి అలాంటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న దాయాదుల సమరం ఆసక్తికరంగా మొదలైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. 

భారత్ జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్‌), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్

పాకిస్తాన్‌ జట్టు: బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ

►ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేకపోవడంతో ఇలా అరుదుగా తలపడుతుండటమే భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌పై ఆసక్తికి కారణమవుతోంది. గత ఏడాది ప్రపంచకప్‌లో అభిమానుల అంచనాలకు విరుద్ధంగా ఇదే వేదికపై పాకిస్తాన్‌ చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడింది. సుమారు పది నెలల విరామం తర్వాత ఇప్పుడు రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి.ఈసారి టీమిండియా పైచేయి సాధిస్తుందా లేక పాక్‌ ఫలితాన్ని పునరావృతం చేస్తుందా చూడాలి.  

భారత్, పాక్‌ మధ్య 9 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఆరింటిలో భారత్, రెండింటిలో పాక్‌ గెలిచాయి. మరో మ్యాచ్‌ ‘టై’ అయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top