ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో వెటరన్ పేసర్ సందీప్ శర్మది కీలక పాత్ర. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో సందీప్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.
151 పరుగుల భారీ లక్ష్య చేధనలో ముంబైకి సందీప్ చుక్కులు చూపించాడు. సందీప్ శర్మ తన మూడు ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ వంటి కీలక వికెట్‌ను సందీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్ శర్మపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజ పేసర్లతో సందీప్‌ను అశ్విన్ పోల్చాడు. ఈ ముగ్గురు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లు అని అశ్విన్ కొనియాడాడు.
"60-70 శాతం మంది బౌలర్లు గేమ్‌ను సరిగ్గా అర్ధం చేసుకోలేరు. కానీ సందీప్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అతడు బ్యాటర్ల మైండ్‌సెట్‌ను ముందే పసిగడతాడు. సందీప్ శర్మకు బుమ్రాతో పోలిస్తే వేగం తక్కువగా ఉండవచ్చు. కానీ అతడిలో కొన్ని అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి.
అతడు మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్. గేమ్‌ను సరిగ్గా రీడ్ చేయడంతో పాటు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగల్గితే ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతారు." అని అశ్విన్ ఓ క్రికెట్ షోలో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాటర్లపై సందీప్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది.
చదవండి: IPL 2026: వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!


