దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు!

Ashwin Hilarious Roasts Australian Legends Writing Abusive Comments - Sakshi

బ్రిస్బేన్‌: ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన డే నైట్‌ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై అత్యంత చెత్త రికార్డును మూట గట్టుకున్న భారత జట్టుపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి.అందునా తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి తిరిగి రావడంతో ఇవి మరీ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రికీ పాంటింగ్‌, మైకెల్‌ వాన్‌, మార్క్‌ వా, మైకెల్‌ క్లార్క్‌, బ్రాడ్‌ హడిన్‌ లాంటి మాజీ ఆటగాళ్లు సోషల్‌ మీడియా వేదికగా టీమిండియాపై వెటకారంతో మాట్లాడిన మాటలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ' కోహ్లి లేని టీమిండియాను చూడలేమని ఒకరంటే.. తొలి టెస్టులోనే ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా పని అయిపోయిందని.. ఈసారి వైట్‌వాష్‌ తప్పదని.. టీమిండియాకు ఇది ఒక చీకటి సిరీస్‌' అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది

కానీ నెలరోజులు తిరగ‍కముందే టీమిండియా 2-1 తేడాతో ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే వరుసగా రెండో సారి టెస్టు సిరీస్‌ను దక్కించుకొని ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వినూత్న రీతిలో స్పందించాడు. టీమిండియాను ఎత్తిపొడుస్తూ మాట్లాడిన మాజీ ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని వారి ట్వీట్స్‌తో పాటు భారత జట్టు కప్‌ అందుకున్న ఫోటోను షేర్‌ చేస్తూ తనదైన శైలిలో చురకలంటించాడు.

‘గుడ్ ఈవ్‌నింగ్ గబ్బా!! ఈ మైదానంలో నేను ఆడలేకపోయాను క్షమించండి. కఠినమైన సమయంలో మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు, గట్టి పోటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సిరీస్‌ను ఎప్పటికీ మరిచిపోలేం. ఇక కొందరు దిగ్గజాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నా.. కోహ్లి లేకుండా మేం సిరీస్‌ను గెలవలేమన్నారు. ప్రధాన ఆటగాళ్లంతా గాయపడినా కుర్రాళ్లతో కలిసి బ్రిస్బేన్‌ టెస్టులో మరుపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఎల్‌హెచ్‌ఎస్‌ ఈక్వల్స్‌ టూ ఆర్‌ఎల్‌ఎస్‌.. ఈక్వేషన్‌ను సరిచేశాం. దిగ్గజాలు ఇప్పుడే సమాధానం ఇస్తారో చెప్పండి' అంటూ ట్రోల్‌ చేశాడు.చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌: భారత జట్టు ఇదే!

కాగా మూడో టెస్టులో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌, అశ్విన్‌ల మధ్య జరిగిన సంభాషణ గురించి అందరికి తెలిసిందే. గాయంతో నాలుగో టెస్టుకు దూరమైన అశ్విన్‌ మూడో టెస్టులో ఓటమి దిశగా పయనిస్తున్న భారత్‌ను హనుమ విహారితో కలిసి ఆసీస్‌ భీకరమైన బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచాడు. ఒకవైపు ఆసీస్‌ పేసర్ల విసురుతున్న బౌన్సర్ల దాటికి నెత్తురోడుతున్న ఏ మాత్రం ఆలక్ష్యం వహించకుండా ఓపికతో ఆడిన అశ్విన్‌.. టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ క్రమంలోనే టిమ్‌ పైన్‌ అశ్విన్‌పై స్లెడ్జింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. 'నిన్ను గబ్బాలో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్'అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.వీటికి అశ్విన్ కూడా తనదైన శైలిలో ‘మేము కూడా మిమ్మల్ని భారత్​లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్​ కావొచ్చు.'అని ధీటుగా బదులిచ్చాడు. అయితే పైన్‌ తాను చేసిన పనికి సిగ్గుపడుతూ అశ్విన్‌కు క్షమాపణ కోరడంతో వివాదం సద్దుమణిగింది.చదవండి: ఆసీస్‌తో సిరీస్‌ : అసలైన హీరో అతనే

కాగా నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 7 వికట్లు కోల్పోయి ఛేదించింది. రిషభ్‌ పంత్‌(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) దూకుడు కనబర్చగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్‌తో మెరిసాడు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్‌ రికార్డును బ్రేక్‌ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top