రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా... అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ బౌలర్లు చరిత్ర సృష్టించారు. అర్జున్ శర్మ, మోహిత్ జాంగ్రా హ్యాట్రిక్‌లతో విజృంభించారు. సుదీర్ఘ చరిత్ర గల రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్ నమోదు చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అస్సాం... తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.
ప్రద్యున్ సైకియా (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), రియాన్ పరాగ్ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. సర్వీసెస్ బౌలర్లలో అర్జున్ శర్మ హ్యాట్రిక్ సహా 5 వికెట్లు పడగొట్టగా... మోహిత్ జాంగ్రా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం సర్వీసెస్ 29.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. ఇర్ఫాన్ ఖాన్ (51) హాఫ్ సెంచరీ సాధించగా... అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 5 వికెట్లు, రాహుల్ సింగ్ 4 వికెట్లు తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 21 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. మొత్తంగా ఈ పోరులో తొలి రోజే 25 వికెట్లు నేలకూలాయి.
చదవండి: ఆస్ట్రేలియా క్రికెటర్లకు సారీ చెప్పిన బీసీసీఐ..


