ఒడిశాతో రంజీ మ్యాచ్
కటక్: ఆంధ్ర ఓపెనర్ శ్రీకర్ భరత్ (129 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
భరత్‌తో పాటు అభిషేక్ రెడ్డి (195 బంతుల్లో 76; 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 161 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కింది. సెంచరీకి సమీపించిన తర్వాత భరత్ అవుట్ కాగా... కెప్టెన్ రికీ భుయ్ (0) విఫలమయ్యాడు. షేక్ రషీద్ (25 బ్యాటింగ్; 2 ఫోర్లు), కరణ్ షిండే (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఒడిశా బౌలర్లలో సంబిత్ బరల్ 2 వికెట్లు పడగొట్టాడు.
సత్తాచాటిన రోహిత్ రాయుడు
గత రెండు మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న హైదరాబాద్ జట్టు... మూడో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హిమాచల్ ప్రదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.
ఆకాశ్ వశిష్ఠ (156 బంతుల్లో 114 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో కదంతొక్కగా... సిద్ధార్థ్ పురోహిత్ (37), అంకుశ్ (30), పుఖ్‌రాజ్ మాన్ (30), మయాంక్ డాగర్ (36) తలాకొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు 3 వికెట్లు పడగొట్టగా... తనయ్ త్యాగరాజన్ 2 వికెట్లు తీశాడు. చామా మిలింద్, నిశాంత్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.


