
లండన్: భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌కు ఇరు దేశాల బోర్డులు కలిసి తమ దిగ్గజాలను గౌరవిస్తూ ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’గా పేరు పెట్టాయి. అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (200), అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉండగా... ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో సచిన్ అగ్ర స్థానంలో, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నారు. అయితే ట్రోఫీ కోసం సచిన్‌తో తన పేరును జత పర్చడం తనను చాలా ఆశ్చర్యపర్చిందని అండర్సన్ వ్యాఖ్యానించాడు.
ఇది తాను ఊహించలేకపోయానని అతను అన్నాడు. ‘నా పేరిట ఒక ట్రోఫీ ఉండటమే విశేషం అయితే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజంతో నా పేరు జత కట్టడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది. అసలు నా పేరును సచిన్ పక్కన చూసుకుంటే అది నేనేనా అనిపించింది. సరిగ్గా చెప్పాలంటే నేను తగినవాడిని కాదనే భావన కూడా వచి్చంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడైన సచిన్ అంటే ఎంతో గౌరవభావం ఉంది. చిన్నప్పుడు అభిమానిగా అతని ఆటను చూశాను. ఆపై ప్రత్యరి్థగా తలపడ్డాను. కెరీర్ ఆసాంతం అతను ఒక దేశం ఆశల భారాన్ని మోశాడు. అలాంటి వ్యక్తితో నా పేరు జత చేయడం నా అదృష్టం’ అని అండర్సన్ తన మనసులో మాటను వెల్లడించాడు.