నవంబర్ 14 నుంచి 23 మధ్యలో ఖతార్ వేదికగా జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల బంగ్లాదేశ్-ఏ జట్టును (Bangladesh-A) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా దేశవాలీ స్టార్, వికెట్‌కీపర్, బ్యాటర్ అయిన అక్బర్ అలీ (Akbar Ali) ఎంపికయ్యాడు.
అక్బర్ అలీకి దేశవాలీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. 92 మ్యాచ్‌ల్లో 27.65 సగటున 1853 పరగులు చేశాడు. అతని తాజాగా ప్రదర్శనలు (40, 44, 28) కూడా పర్వాలేదనేలా ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలైన రాజ్‌షాహీ, ఖుల్నా టైగర్స్ తరఫున కూడా అక్బర్ అలీ సత్తా చాటాడు.
ఈ జట్టు అక్బర్‌తో పాటు అనుభవజ్ఞులు, యువశక్తి కలయికగా ఉంది. అబూ హీదర్ రోని, రిపోన్ మొండల్ బంగ్లాదేశ్ సీనియర్ జట్టు తరఫున సత్తా చాటారు. రోని 2016, మొండల్ 2023లో సీనియర్ టీమ్‌లోకి అరంగేట్రం చేశారు.
యార్కర్ స్పెషలిస్ట్ అయిన రోని 13 టీ20ల్లో 6 వికెట్లు తీయగా.. మొండల్ 23 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. ఈ జట్టులో దేశవాలీ స్టార్లు,యువ ఆటగాళ్లు జిషన్ అలం, మహిదుల్ ఇస్లాం, అరిఫుల్ ఇస్లాం వంటి వారికి చోటు దక్కింది.
ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంగ్‌కాంగ్ జట్లు పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ, హాంగ్‌కాంగ్‌లతో కలిసి గ్రూప్-బిలో పోటీపడుతుండగా.. భారత్-ఏ, పాకిస్తాన్-ఏ, ఒమన్, యూఏఈ గ్రూప్-ఏ తలపడనున్నాయి.
టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, ఒమన్ తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, యూఏఈ ఢీకొంటాయి. నవంబర్ 15న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ హాంగ్‌కాంగ్‌ను ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోకి మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది.
గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు (A1 vs B2, B1 vs A2) చేరతాయి. ఈ మ్యాచ్‌లు నవంబర్ 21న జరుగుతాయి. సెమీస్ విజేతలు నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
బంగ్లాదేశ్ ఏ జట్టు..
అక్బర్ అలీ (కెప్టెన్), జిషాన్ అలం, హబీబుర్ రెహమాన్, జవాద్ అబ్రార్, అరిఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ చౌదరి, మహిదుల్ ఇస్లాం భుయాన్, రకీబుల్ హసన్, ఎస్‌ఎం మెహెరోబ్ హుస్సేన్, అబూ హిడర్ రోనీ, తుఫాయెల్ అహ్మద్, షాధిన్ ఇస్లాం, రిపోన్ మొండోల్, అబ్దుల్ గఫార్ సక్లైన్, మృత్తుంజయ్ చౌదరి
చదవండి: ప్రపంచ క్రికెట్‌ను శాశించేందుకు మరో వసంతంలోకి అడుగుపెట్టిన కోహ్లి


