
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విదేశీ వేదికపై 20 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా అవతరించింది. షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో 29 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్ఘన్ జట్టు 20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడంతో ఆఫ్ఘనిస్తాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది.
ఓవరాల్‌గా ఓ వేదికపై అత్యధిక విజయాలు సాధించిన రికార్డు బంగ్లాదేశ్ పేరిట ఉంది. బంగ్లాదేశ్ ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో 48 మ్యాచ్‌ల్లో 24 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో అత్యధిక టీ20 విజయాలు సాధించిన రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది.
పాక్ లాహోర్‌లోని గడాఫీ స్టేయడింలో 26 మ్యాచ్‌ల్లో 16 విజయాలు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత విదేశీ వేదికగా అత్యధిక విజయాలు సాధించిన రికార్డు కూడా పాకిస్తాన్ పేరిటే ఉంది. పాక్ దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 32 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్ 4 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఓపెనర్లు గుర్బాజ్ (40), ఇబ్రహీం జద్రాన్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కరీం జనత్ (28), గుల్బదిన్ నైబ్ (20 నాటౌట్), అజ్మతుల్లా (14 నాటౌట్) ఆఖర్లో వేగంగా పరుగులు సాధించారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ 2 వికెట్లు తీయగా.. సిమ్రన్‌జీత్ సింగ్, ముహమ్మద్ ఫరూక్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 171 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ.. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడింది. చివరి ఓవర్‌లో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. యూఏఈ తొలి మూడు బంతులకే 12 పరుగులు చేసి గెలుపు ఖాయమనుకుంది. అయితే ఆఫ్ఘన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మాలిక్ అనూహ్యంగా పుంజుకుని చివరి 3 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో యూఏఈకి ఓటమి తప్పలేదు.
యూఏఈ ఇన్నింగ్స్‌కు కెప్టెన్ ముహమ్మద్ వసీం (44), అలీషాన్ షరాఫు (27) శుభారంభాన్ని అందించారు. ఆఖర్లో ఆసిఫ్ ఖాన్ (40) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా చివరి రెండు బంతులను వృధా చేసి ఆఫ్ఘన్ ఓటమికి బాధ్యుడయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్, ముజీబ్, షరాఫుద్దీన్, నూర్ అహ్మద్, అహ్మద్జాయ్ తలో వికెట్ తీశారు.
కాగా, ఈ టోర్నీ ఫైనల్ రేపు జరుగనుంది. టైటిల్ కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తలడపడతాయి. ఈ టోర్నీ ముగియగానే ఇరు జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటాయి.