IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే? | Aakash Chopra picks his best 12 of IPL 2026 no place for Gill and Sai | Sakshi
Sakshi News home page

IPL 2026: అత్యుత్తమ జట్టు.. గిల్‌, సాయి సుదర్శన్‌కు దక్కని చోటు

Jun 2 2026 1:13 PM | Updated on Jun 2 2026 1:29 PM

Aakash Chopra picks his best 12 of IPL 2026 no place for Gill and Sai

భారత మెగా క్రికెట్‌ సంబరం ఐపీఎల్‌-2026 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి.. డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.

ఇక రెండు నెలలకు పైగా వినోదం పంచిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించి.. వింటేజ్‌ కింగ్‌ను గుర్తుచేశాడు.

అయితే, సీజన్‌ ఆసాంతం అదరగొట్టిన గుజరాత్‌ ఓపెనింగ్‌ జోడీ సాయి సుదర్శన్‌- శుబ్‌మన్‌ గిల్‌ టైటిల్‌ పోరులో మాత్రం నిరాశపరిచారు. సాయి 12, గిల్‌ 10 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్‌ ఓటమికి అక్కడే పునాది పడింది.​

అత్యుత్తమ జట్టు
ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. ఈ సీజన్‌కు గానూ తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో పన్నెండు మందికి చోటిచ్చాడు. ఈ మేరకు..

ఓపెనర్లుగా ఎవరంటే?
‘‘వైభవ్‌ సూర్యవంశీ.. మరో మాటకు తావు లేకుండా నా జట్టులో అతడు ఉంటాడు. పదిహేనేళ్ల వయసులోనే అతడు ఆరెంజ్‌ క్యాప్‌ గెలిచాడు. అతడితో పాటు దిగ్గజ విరాట్‌ కోహ్లి నా జట్టు ఓపెనర్‌గా ఉంటాడు.

మూడో స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ను ఆడిస్తాను. అతడే నా వికెట్‌ కీపర్‌.. అదే విధంగా వైస్‌ కెప్టెన్‌ కూడానూ!.. నాలుగో స్థానానికి ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ను ఎంచుకుంటాను. అతడే నా జట్టు సారథి.

అతడు లేకుంటే ఎలా?
ఐదో స్థానంలో హైదరాబాద్‌ పవర్‌ హిట్టర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఉంటాడు. అతడు లేకుండా అసలు ఈ జట్టు కూర్పు సాధ్యమే కాదు. పందొమిదేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఆరెంజ్‌ క్యాప్‌ కోసం పోటీపడ్డ ఏకైక మిడిలార్డర్‌ బ్యాటర్‌ అతడు.

అతడికి తోడుగా హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా నా జట్టులో ఉంటాడు. హార్దిక్‌ పాండ్యా ఈసారి దారుణం గా విఫలం కాగా.. అదే సమయంలో నితీశ్‌ రెడ్డి అదరగొట్టాడు. ఏడో స్థానంలో కృనాల్‌ పాండ్యా సరైనోడు.

ఎనిమిదో స్థానానికి సునిల్‌ నరైన్‌ లేదంటే రషీద్‌ ఖాన్‌ను ఎంచుకుంటాను. నాకు ఒక్క స్పిన్నర్‌ అవసరం మాత్రమే ఉంది. కాబట్టి సునిల్‌తో వెళ్తాను. ఇక తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ ఉంటాడనడంలో సందేహం లేదు.

బౌలింగ్‌ దళం ఇదే
ఈ సీజన్‌లోనూ అత్యుత్తమంగా బౌలింగ్‌ చేశాడు. కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్‌లకు కూడా నా జట్టులో చోటు ఉంటుంది. ఇక పన్నెండో స్థానం కోసం అన్షుల్‌ కాంబోజ్‌, సకీబ్‌ హుసేన్‌, రసిఖ్‌ సలామ్‌ దర్‌ పేర్లను పరిశీలించాను.

సకీబ్‌ అత్యద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రసిఖ్‌ కూడా తక్కువేమీ కాదు. అన్‌క్యాప్డ్‌ కేటగిరీలో అతడే అత్యధిక వికెట్ల వీరుడు. కాబట్టి రసిఖ్‌కే నా ఓటు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఉన్న రెండు, మూడు స్థానాల్లో ఉన్న గిల్‌ (732 రన్స్‌), సాయి (722)లకు మాత్రం ఆకాశ్‌ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు.

ఐపీఎల్‌-2026 సీజన్‌కు గానూ ఆకాశ్‌ చోప్రా ప్రకటించిన అత్యుత్తమ జట్టు (12 member).
వైభవ్‌ సూర్యవంశీ (776 రన్స్‌), విరాట్‌ కోహ్లి (675 రన్స్‌), ఇషాన్‌ కిషన్‌ (602 రన్స్‌), రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌- 501 రన్స్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (624 రన్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (302 రన్స్‌, 8 వికెట్లు ), కృనాల్‌ పాండ్యా (226 రన్స్‌, 14 వికెట్లు), సునిల్‌ నరైన్‌ (15 వికెట్లు), భువనేశ్వర్‌ కుమార్‌ (28 వికెట్లు), కగిసో రబడ (29 వికెట్లు), జోఫ్రా ఆర్చర్‌ (25 వికెట్లు), రసిఖ్‌ సలామ్‌​ దర్‌ (19 వికెట్లు).

చదవండి: నేనేమీ లక్కీ  చార్మ్‌ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!

Advertisement
 
Advertisement
Advertisement