బంగ్లాదేశ్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. గత కొంతకాలంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వివాదాలతో సతమతమవుతోంది. రాజకీయ అస్థిరత కారణంగా టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్‌కు తాజా మ్యాచ్ ఫిక్సింగ్ ఆ దేశ క్రికెట్ ఉనికినే దెబ్బతీసేలా ఉందని చెప్పొచ్చు.
ఇటీవల జరిగిన సీజేకేఎస్ టాలెంట్ కప్ 2026లో ఏడుగురు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 3న జరిగిన టీ20 టోర్నమెంట్లో బాకలియా ఏకాదశ, క్రెసెంట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
బాకలియా ఏకాదశ జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు సాకిబ్ హుస్సేన్, ఒబైదుల్ ఆలం, ఉమర్ ఫరూక్, టిన్ ధర్, మాహిర్ అన్వర్, మహ్మద్ ఇక్బాల్ మరియు నాజ్ముల్ ఇస్లాంలు కావాలని ఔటయ్యారు. ఈ ప్రవర్తనపై అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. వారు ఉద్దేశపూర్వకంగానే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ ఫిక్సింగ్ ఉదంతంలో కేవలం ఆటగాళ్లే కాకుండా కోచ్ అమీనుల్ హక్ పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనిని తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఛట్టోగ్రామ్ జిల్లా క్రీడా సంస్థ, కోచ్ అమీనుల్ హకు ఐదేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుండి నిషేధించింది. అలాగే సదరు ఆటగాళ్లపై విధించిన నిషేధాన్ని దేశవ్యాప్తంగా అన్ని దేశీయ లీగ్లో అమలు చేయాలని బీసీబీకి అధికారికంగా లేఖ రాసింది.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)కూడా గతంలో ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంది. బీసీబీ డైరెక్టర్ ముఖైసూర్ రెహమాన్ షమీమ్ ఫిక్సింగ్ చర్చల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే 2025 సీజన్ లో ఆరుగురు జాతీయ ఆటగాళ్లతో సహా మొత్తం 10 మంది క్రికెటర్లు అవినీతి నిరోధక విభాగం నిఘాలో ఉండటం గమనార్హం.
అయితే భారత్‌తో తిరిగి సత్సంబంధాలు కోరుకుంటున్న బంగ్లాదేశ్ త్వరలోనే మహిళల బంగ్లా ప్రీమియర్ లీగ్‌లోకి భారత మహిళా క్రికెటర్లను ఆహ్వానించాలని బంగ్లా బోర్డు యోచిస్తోంది. ఇక మంగళవారం బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) నూతన చైర్మన్‌గా మాజీ క్రికెటర్‌గా తమీమ్ ఇక్బాల్ ఎన్నికైన సంగతి తెలిసిందే.


