ప్రైవేటు ట్యాంకర్ ద్వారా సరఫరా బోరుబావి లేక నీళ్లకోసం అవస్థలు పట్టించుకోని ఉన్నతాధికారులు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండల కసూర్భా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో తాగునీరు ఇక్కట్లు నెలకొన్నాయి. మంచినీళ్ల కోసం పడరానీ పాట్లు పడుతున్నారు. ఆ విద్యాలయంలో శాశ్వత బోరుబావి లేకపోవడంతో గుక్కెడు నీళ్ల కోసం అరిగోస తప్పడం లేదు. ఈ కేజీబీవీలో 220మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యాలయం ఆవరణంలో మిషన్ భగీరథ సంపు నిర్మించుకుని దాని ద్వారా నీరు ఉపయోగించుకుంటున్నారు. కాగా, మిషన్ భగీరథ నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మిషన్ భగీరథలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతే స్నానాలు కూడా చేయకుండా రోజుల తరబడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా
తాగేందుకు రోజు రెండు ట్యాంకర్లను తెప్పిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ రూ.800 నుంచి రూ.1000 వరకు వెచ్చించి నీటిని సరఫరా చేయిస్తున్నారు. అయితే, గతంలో రెండు, మూడు చోట్ల బోరు వేయించేందుకు ప్రయత్నంచినా చుక్కనీరు రాలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. బోరుబావి ఉంటే తప్ప శాశ్వత తాగునీరు సమస్యను పరిష్కరించలేమని, ప్రతీరోజు నీళ్లకోసం గోస పడవల్సి వస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
సరిపోని మిషన్ భగీరథ నీళ్లు
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ ద్వారా నీళ్లను తెప్పించుకుంటున్నాం. బోరు వేయించాలని చెబుతున్నాం. ప్రహారీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం సమయం వరకు నూతనంగా బోరు వేయించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –సరిత, కేజీబీవీ ప్రత్యేకాధికారి


