దుబ్బాకటౌన్: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని కలెక్టర్ కె.హైమావతి స్పష్టం చేశారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో సీడబ్ల్యూసీ గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని, వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తోందన్నారు. మిల్లులలో స్థలాభావం కారణంగా దిగుమతుల్లో కొంత ఆలస్యం జరుగుతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానికంగా అందుబాటులో ఉన్న గోదాములను గుర్తించి వినియోగంలోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ గోదాంలో నిల్వ ఉన్న వేరు శనగను పక్కనే ఉన్న మక్కల గోదాంకు తరలించాలని మార్కెటింగ్ డీఎం నాగరాజుకు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర రావు, ఏపీఎం మహిపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య, వైస్ చైర్మన్ స్వామి, ఆర్‌ఐ నాగరాజు, జీపీఓ సుమన్ పాల్గొన్నారు.
కొనుగోళ్లు మరింత వేగవంతం
మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని అల్వాల గోదాంను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్‌మిల్లుల్లో స్థల కొరతను అధిగమించడానికి గోదాంల రేకుల ఫిట్టింగ్ సరిచేసి వినియోగంలోకి తేవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా, రైతుల ఇబ్బందులను తీరుస్తూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆమె వెంట ఐకేపీ ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సీసీలు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ హైమావతి