కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొంటామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ హైమావతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాల కారణంగా 22 మండలాల్లో సుమారు 2,976 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌మిల్లులో దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు సైతం రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. నేటికీ 427 కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తంగా 58,455 మంది రైతుల నుంచి 3,14,868 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.457 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు.
వర్గల్(గజ్వేల్): కావేరి యూనివర్సిటీ వై్‌స్ చాన్సలర్ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావుకు రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ చాన్సలర్ జీ.భాస్కర్‌రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురువారం హర్యానాలోని ఎంపీహెచ్‌యూ వేదికగా నిర్వహించిన జాతీయ సదస్సులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌షైనీ చేతుల మీదుగా సీహెచ్‌ఏఐ(చాయ్) హానరరీఫెలో –2026, అమిత్ కృషి రుషి అవార్డు–2026 లను వీసీ ప్రవీణ్‌రావు అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డులు వర్సిటీకి గర్వకారణమన్నారు. వ్యవసాయ, ఉద్యాన పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనాభివృద్ధి, విద్యాసంస్థల బలోపేతానికి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డులు వరించాయన్నారు.
దుబ్బాక: దేశభద్రత, సమగ్ర అభివృద్ధి కోసమే ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(సర్).. సర్‌పై ప్రజల్లో సమగ్రంగా అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్‌గౌడ్ అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు దుబ్బాక మున్సిపాల్టిలో సర్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ గురించి వివరించడంతో పాటు రాబోయే కాలంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు దోహదపడుతుందన్నారు. సమావేశంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దొరగొల్ల శ్రీకాంత్ యాదవ్, సర్ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి వంశీకృష్ణాగౌడ్, తిరుమల్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, ప్రవీణ్, రమణారెడ్డి, ప్రసాద్, భాస్కర్, రవీందర్, కౌన్సిలర్లు సాయి కుమార్‌గౌడ్, కనకరాజు తదితరులు ఉన్నారు.
దుబ్బాకటౌన్: మాదిగ సామాజిక వర్గం విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎంఆర్పీఎస్ జాతీయ నేత, జిల్లా ఇన్‌చార్జి మంద పవన్‌కుమార్ అన్నారు. గురువారం దుబ్బాక మెడికల్ అసోసియేషన్ భవనంలో మాదిగల్లో అక్షరాస్యతను పెంచేందుకు చేపట్టిన ‘గ్రామాల్లో 40 రోజుల కార్యక్రమాన్ని’ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముక్కపల్లి రాజుతో కలిసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే నివేదికలో అక్షరాస్యతలో మాదిగలు వెనకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు విద్య ప్రాముఖ్యతను వివరించి, అక్ష్యరాస్యతను పెంపొందించడం కోసం గ్రామ గ్రామాన చైతన్య సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఇస్తారిగల్ల ఎల్లం, రాజనర్సు, నవీన్, ప్రశాంత్, మహేశ్, తదితరులున్నారు.


