● మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కు
● వడ్ల కొనుగోళ్ల తీరుపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
గజ్వేల్: కొనుగోళ్లు సకాలంలో జరగక, అకాల వర్షాలతో ధాన్యం తడిసి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులకు ‘తరుగు’ పేరిట వాత పెడుతున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై నిలువునా ముంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వడ్లు అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 421 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 58,455 మంది రైతులకు చెందిన 3.14లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు అతికష్టమ్మీద జరిగాయి. ఇక్కడ 3.70లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రాగా, 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులు వస్తాయని అధికారులు అంచనా వేసిన సంగతి తెల్సింది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం భారీగా ఉంది. కొనుగోళ్లకు నెల రోజులకుపైగా కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న రైతులకు మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం.. మరింత కుంగదీసింది. దీంతో రైతులు పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయారు. తడిసిన ధాన్యం ఆరబెట్టుకొని, అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.
నిలువుదోపిడీ..
ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులను తరుగు పేరిట వాత పెడుతున్నారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై ్క నట్టేట ముంచుతున్నారు. 40–50కిలోల బస్తాపై 2–3కిలోలు కట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 5కిలోల వరకు కూడా కోత పెడుతున్నారు. కొనుగోళ్లు సక్రమంగా సాగని ప్రస్తుత తరుణంలో ఇదేంటని ప్రశ్నిస్తే తమ వడ్లను కాంటా పెడతారో? లేదోననే భయంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి మిన్నకుండిపోతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. కొన్ని చోట్ల రైతుల తిరగబడితే అప్పటికప్పుడు తప్పులను సరిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాగైనా ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలనే టార్గెట్ వల్ల ఉన్నతాధికారుల సైతం ఇలాంటి వ్యవహారాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.
కొన్ని చోట్ల ఇలా...
● గజ్వేల్ మండలంలోని ఓ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతుకు కొన్ని రోజుల క్రితం సుమారుగా 390క్వింటాళ్లకుపైగా ధాన్యం కాంటా అయినట్లుగా ముందుగా ట్రక్ షీట్ ఇచ్చారు. సరుకు మిల్లుకు తరలించగానే తరుగు పేరిట ఇందులోంచి సుమారుగా 4.5క్వింటాళ్లకుపైగా తగ్గించి మరో ట్రక్ షీట్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న ఆ రైతు కొనుగోలు కేంద్రాలతో వాగ్వాదానికి దిగడంతో...ఆ తప్పును సరిచేశారు.
● ఇదే మండలంలోని మరో గ్రామంలోని కొనుగోలు కేంద్రంలోనూ 40కిలోల బస్తాపై తరుగు పేరిట 4కిలోల కోత పెడుతున్నారు. కొన్ని రోజులుగా ఇది సాగుతూనే ఉంది.
● జిల్లాలోని అన్ని మండలాల్లో ఇది పరిస్థితి కొనసాగుతోంది. ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరెన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


