సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రోజుకో రకం టిఫిన్‌తో పాటు మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. మూడు రోజులు పాలు.. మరో మూడు రోజులు రాగి జావ అందించనున్నారు. జూన్ 12 నుంచి పథకం ప్రారంభించేందుకు ఇంటర్ విద్యాశాఖ సమాయత్తం అవు తోంది. జిల్లాలో 20 జూనియర్ కళాశాలలు ఉండగా, సుమారు 6వేల మంది విద్యార్థులు ఉన్నారు.
ఆకలి తీరుస్తూ.. నమోదు శాతం పెంచుతూ
‘తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్’ పథకంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలన్నీ మండల కేంద్రాల్లో ఉన్నాయి. అయితే సుమారు 90 శాతం విద్యార్థులు సమీప గ్రామాలు, తండాల నుంచి వస్తున్నారు. మెజార్టీ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఉదయం విద్యార్థులు సరిగా తినకుండానే కాలేజీకి వస్తున్నారు. సాయంత్రం 4.30 వరకు అర్ధాకలితో గడుపుతున్నారు. కొన్నేళ్లుగా ప్రత్యేక తరగతులు కూడా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పాఠాలు కూడా సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఎదిగే వయసులో సమయాను కనుగుణంగా పోషకాహరం లేక, బలహీనంగా మారుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే మధ్యాహ్న భోజనం ప్రారంభించాలని చాలా కాలంగా విద్యారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. టిఫిన్, మధ్యాహ్న భోజనం అమలైతే విద్యార్థుల నమోదు.. హాజరు శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్
జూన్ 12 నుంచి ప్రారంభం
జిల్లాలో 20 కళాశాలలు
సుమారు 6వేల మంది విద్యార్థులు
రోజుకో రకం టిఫిన్.. పాలు, జావ
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకో రకం టిఫిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం దోశ, చట్నీ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ (రెండు) సాంబారు, బుధవారం పూరీ(రెండు), మిక్స్‌డ్ వెజిటబుల్ కుర్మా, గురువారం బోండా– చట్నీ, శుక్రవారం ఇడ్లీ–చట్నీ, శనివారం ఉప్మా– చట్నీని మెనూగా నిర్ణయించారు. వీటితో పాటు వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా మొదట కేంద్రీకృత కిచెన్ల ద్వారా వీటిని అందించనున్నారు.


