విద్యుత్‌ నకిలీలలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ నకిలీలలు

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

ట్రాన్స్‌కోలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కేసు..

ట్రాన్స్‌కోలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కేసు..

విజిలెన్స్‌ విచారణలో

ఆధారాల గుర్తింపు

కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లిన అవినీతి సొమ్ము

సీనియర్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు

విద్యుత్‌శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఆ శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ పాత్ర ఉన్నట్లు ఆశాఖ విజిలెన్స్‌ విచారణలో తేలింది. –సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

కిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వద్ద నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ రూ.లక్షల్లో ముడుపులు తీసుకున్నట్లు ప్రాథమికంగా తేల్చిన విజిలెన్స్‌ విభాగం ఈ ముడుపుల్లో కొంత మొత్తాన్ని తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నట్లు ఆధారాలతో సహా గుర్తించింది. ఈ మేరకు పూర్తి నివేదిక ఆశాఖ ఉన్నతాధికారులకు పంపడంతో సదరు అధికారిపై ఇటీవల సస్పెన్షన్‌ వేటు పడింది.

జేఎల్‌ఎంలుగా ఉద్యోగంలో చేరి..

2020లో నలుగురు ఆర్టిజన్లు నకిలీ ఎస్సెస్సీ సర్టిఫికెట్లు పెట్టి జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం)లుగా ఉద్యోగాలు పొందారు. గుట్టుచప్పుడు కాకుండా వీరు దాదాపు నాలుగేళ్లుగా ఉద్యోగాల్లో కొనసాగారు. రూ.వేలల్లో జీతభత్యాలు, ఇతర అన్ని సౌకర్యాలు పొందారు. అలాగే ఐటీఐ కూడా పూర్తి చేశామని చెప్పి అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ (ఏఎల్‌ఎం)లుగా పదోన్నతి కూడా పొందినట్లు తెలుస్తోంది. పదోన్నతుల సందర్భంగా పెట్టిన ఐటీఐ సర్టిఫికెట్లు ఫేక్‌ అని టెక్నికల్‌ బోర్డు ధ్రువీకరించింది. దీంతో విజిలెన్స్‌ అధికారులు లోతుగా విచారిస్తే వీరివి ఎస్సెస్సీ సర్టిఫికెట్లు కూడా నకిలీవేనని తేలింది. మరింత కూపీ లాగడంతో ఈ వ్యవహరంలో మరికొందరి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. నకిలీగాళ్ల నుంచి ఈ అధికారి రూ.లక్షల్లో ముడుపులను తీసుకున్నట్లు తేలింది. ఇలా తన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ముడుపుల మళ్లింపు ఆధారాలు లభించాయి.

ఎంకై ్వయిరీ పెండింగ్‌ పెట్టి..

సాధారణంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలన కోసం పంపుతారు. ఈ సర్టిఫికెట్లు సరైనవేనా? కాదా? అని తెలుసుకుంటారు. ఎస్సెస్సీ సర్టిఫికెట్లను ఎస్సెస్సీ బోర్డుకు, ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్‌ బోర్డుకు పంపుతారు. సదరు అధికారి వీరి సర్టిఫికెట్లను ఆయా బోర్డులకు పంపకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. పదోన్నతుల సందర్భంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఐటీఐ సర్టిఫికెట్లను టెక్నికల్‌ బోర్డుకు పంపగా అవి నకిలీవని తేల్చారు. ఇన్నాళ్లు వెరిఫికేషన్‌ కోసం పంపకుండా పెండింగ్‌లో పెట్టి వారిని కాపాడినందుకు సదరు సీనియర్‌ అసిస్టెంట్‌ ఒక్కోక్కరి వద్ద రూ.లక్షల్లో ముడుపులు పొందినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాకు మళ్లినట్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement