ఉద్యోగుల్లో బదిలీ గుబులు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల్లో బదిలీ గుబులు

May 28 2026 8:55 AM | Updated on May 28 2026 8:55 AM

సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. జిల్లాలో ఉద్యోగులెవరిని కదిలించినా బదిలీల చర్చే వినిపిస్తోంది. ఎవరెవరు సీనియర్లు? ఎక్కడికి బదిలీ అయ్యే అవకాశం ఉంది? ఇతరత్రా విషయాలపైనే జోరుగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ఈ నెల 30 వరకు బదిలీలు చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. బదిలీల కోసం కొన్ని శాఖల ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వగా, మరికొందరు ఇస్తున్నారు.

40శాతానికే పరిమితం

ఉద్యోగుల బదిలీలు 40శాతానికి మించి చేయవద్దని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో జూనియర్‌ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు శాఖలలో సీనియారిటీ జాబితా ప్రకటించారు. బదిలీ ఎక్కడికి అవుతుందోనని ఉద్యోగుల్లో టెన్షన్‌ నెలకొంది. కొందరు ఉద్యోగులు జిల్లా ఆవిర్భావం నుంచి ఇక్కడే తిష్ట వేశారు. రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు.. వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ తహసీల్దార్‌ వరకు ఒకే మండలం, పని చేసిన చుట్టు పక్క మండలాల్లోనే విధులు నిర్వర్తించడం గమనార్హం.

పంచాయతీ కార్యదర్శులకు కౌన్సిలింగ్‌

132 మంది గ్రేడ్‌–4 పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. బుధవారం వీరికి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్‌ను నిర్వహించారు. వైద్యారోగ్య శాఖలో ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌)లు 23 మంది, స్టాఫ్‌ నర్సులు 11 మందికి, రెవెన్యూ, వ్యవసాయ శాఖలో బదిలీలు కానున్నాయి. వ్యవసాయ శాఖలో 40 ఏఈవోలు, ఇరిగేషన్‌ శాఖలో బదిలీల కోసం కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఇంకా ఎక్కడికి బదిలీ అయ్యారో ఉత్తర్వులు జారీ చేయలేదు.

పెండింగ్‌లోనే జీఓ 317 బాధితుల సమస్య

గత ప్రభుత్వం అమలు చేసిన జీఓ317 కారణంగా పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారికి కొంత ఉపశమనం కలిగించేందుకు 3 నుంచి నాలుగేళ్ల వరకు డిప్యుటేషన్‌ ఇవ్వాలని గతంలో 197 జీఓను జారీ చేసింది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. మూడున్నరేళ్ల నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్‌ ప్లేస్‌ ఆధారంగా ఆయా జిల్లాలకు బదిలీలు చేపట్టి తర్వాత సాధారణ బదిలీలు చేయాలని జీఓ317 బాధితులు కోరుతున్నారు.

నాలుగు స్థాయిల ఉద్యోగులకు..

నాలుగు స్థాయిల ఉద్యోగులకు బదిలీలు జరగనున్నాయి. జిల్లా స్థాయిలో అటెండర్‌ నుంచి రికార్డు అసిస్టెంట్‌, టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్లు బదిలీలు అవుతున్నాయి. రాజన్న జోన్‌ పరిధిలో(జోన్‌–3) కరీంనగర్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌ జిల్లాలు రానున్నాయి. సీనియర్‌ అసిస్టెంట్‌లు, సూపరింటెండెంట్‌, డిప్యూటీ తహసీల్దార్లు, గ్రేడ్‌–1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు, హెచ్‌డబ్ల్యూవో, ఎంపీహెచ్‌ఏ(ఏఎన్‌ఎం), స్టాఫ్‌నర్సు, ల్యాబ్‌ టెక్నిషియన్‌, వెటర్నరీ అసిస్టెంట్‌ ఉద్యోగులు ఉండనున్నారు. మల్టీ జోన్‌–1 పరిధిలోకి కాశేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి జోన్‌లు రానున్నాయి. ఎంపీడీవో, తహసీల్దార్‌, ఎంపీవో, మండల వ్యవసాయాధికారి, ఏఈలు, ఏఎస్‌డబ్ల్యూవో బదిలీలు కానున్నారు.

ఎవరిని కదిలించినా అదే చర్చ

రెండు రోజుల్లో కౌన్సిలింగ్‌ పూర్తి

కోరుకున్న జిల్లాకు బదిలీ

చేపట్టాలంటున్న జీఓ317 బాధితులు

జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి

జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి. వీరిని బదిలీ చేసిన తర్వాతే మిగతా వారిని చేయాలి. కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ సంఘాలు, బాధితుల పోరాటాల ఫలితంగా డిప్యూటేషన్ల కోసం ప్రభుత్వం 197జీఓను తీసుకవచ్చింది. డిప్యుటేషన్ల కోసం ఆప్షన్లు ఇచ్చినా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇప్పటికై నా మంత్రులు, ఉన్నత అధికారులు స్పందించాలి.

– విక్రంరెడ్డి, టీఎన్‌జీఓఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement