● వెంకటరమణ ట్రేడర్స్‌లో అవకతవకలు
● రూ.26.83లక్షల విలువైన విత్తనాల
విక్రయం నిలిపివేతకు నోటీసు
గజ్వేల్: పట్టణంలోని వెంకటరమణ ట్రేడర్స్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్ బుధవారం తనిఖీలు చేపట్టింది. టాస్క్‌ఫోర్స్ ప్రత్యేకాధికారి ఏడీఏ మల్లయ్య, సీఐ శ్రీధర్, స్థానిక ఏడీఏ బాబునాయక్‌లు సంయుక్తంగా ఈ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆ దుకాణంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లైసెన్స్‌లను పరిశీలించి అవకతవకలు గుర్తించారు. దీంతో రూ.26.83లక్షల విలువైన విత్తనాల విక్రయాలను నిలిపేస్తూ నోటీసులు (స్టాప్ సేల్ నోటీస్) ఇచ్చారు. ఈ తనిఖీల్లో రాయపోల్ వ్యవసాయాధికారి నరేష్, ఎస్‌ఐ సురేష్ తదితరులున్నారు.
ధాన్యం మొత్తం
కొనేవరకు పోరాటం
గజ్వేల్: పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో విఫలమైన రేవంత్ సర్కారు రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. కొనుగోళ్ల వైఫల్యాన్ని నిరసిస్తూ బుధవారం గజ్వేల్‌లోని మార్కెట్ యార్డు ఆవరణలో ‘రైతు దీక్ష’ ‘వంటా వార్పు’ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కడా కూడా 40శాతానికి మించి కొనుగోళ్లు జరగలేదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నేతలు గ్రామాల్లోకి వస్తే రైతులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు సైతం రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన చివరి గింజ కొనుగోలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. రెండ్రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లను పూర్తిగా తరలించాలని, లేనిపక్షంలో రాజీవ్‌రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఉదయం ప్రారంభమైన ‘రైతు దీక్ష’ మధ్యాహ్నం వరకు కొనసాగింది. ప్రతాప్‌రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌డీఓ కార్యాలయంలో కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, దేవీరవీందర్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


