వర్గల్(గజ్వేల్): మండలంలో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రికార్డుస్థాయిలో 48.6 మి.మీటర్ల వర్షం కురిసింది. నాచారం, మజీద్‌పల్లి, నెంటూరు, మైలారం, వర్గల్, వేలూరు, అంబర్‌పేట, గిర్మాపూర్, అనంతగిరిపల్లి తదితర చోట్ల రోడ్డుపై ఆరబోసిన, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. గాలి తీవ్రతకు కప్పిన కవర్లు సైతం ఎగిరిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ వైర్లు నేలవాలాయి. మజీద్‌పల్లిలో జనావాసాలపై కరెంటు స్తంభం ఒరిగిపడింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. మండలవ్యాప్తంగా 25 కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయని, పలుచోట్ల కరెంటు తీగలు తెగిపోయాయని విద్యుత్ ఏఈ వాసుదేవరావు తెలిపారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


