మాజీ మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజా కొనాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం చిన్నకోడూరుతో పాటు ఇబ్రహీంనగర్, గోనెపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఆధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనకపోవడం వల్లే పంట తడిసి ముద్దయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా రోహిణి కార్తే నాటికి వడ్ల కొనుగోళ్లు పూర్తవుతాయని, కానీ ప్రభుత్వం ఆన్‌లైన్ ట్యాగింగ్ పేరుతో నెల రోజులు కాలయాపన చేయడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర వదిలి రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. వారం రోజులు ఇసుక రవాణా ఆపి, ఆ లారీలను ఆర్టీఏ అధికారులు వడ్ల రవాణాకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, మాణిక్యరెడ్డి,శ్రీనివాస్ పాల్గొన్నారు.


