‘కల్యాణ లక్ష్మి’ చెక్కులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. పంపిణీ అంశం కొలిక్కి రాకపోవడం లబ్ధిదారులను కలవరపెడుతోంది. రెండు నెలలుగా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో విసిగిపోయి ఈనెల 1న గజ్వేల్ ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట ‘కల్యాణ లక్ష్మి’ కాగితాలకే పరిమితమా’..?, ‘చెక్కులకు మోక్షం ఎప్పుడు’..? పోస్టర్లను అతికించి తమ నిరసన తెలియజేయడం చర్చకు దారితీసింది. అయినా అధికారుల నుంచి స్పందన కరువవుతోంది. – గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. ‘కల్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీలోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, కుకునూర్‌పల్లి, జగదేవ్‌పూర్, మర్కూక్ మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మి చెక్కులు గజ్వేల్ ఆర్‌డీఓ పరిధిలో, తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు చెందిన చెక్కులు తూప్రాన్ ఆర్‌డీఓ పరిధిలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తూప్రాన్ ఆర్‌డీఓ పరిధిలోని చెక్కుల పంపిణీ ఎప్పటికప్పుడూ సజావుగా సాగుతోంది. గజ్వేల్ ఆర్‌డీఓ పరిధిలోనే భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ నెలల తరబడి పెండింగ్‌లో ఉండటం లబ్ధిదారులకు ఆందోళన కలిగిస్తున్నది. రెండు నెలల క్రితమే ఇక్కడ వెయ్యి చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఈ చెక్కుల వాలిడిటీ మూడు నెలలు మాత్రమే. ఒకవేళ పంపిణీ నాటికీ ఎక్స్‌పైరీ అయితే ఆ చెక్కులను రీవాల్యూ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగక తప్పదు.
ఎందుకీ ఈ పరిస్థితి?
నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రతి అంశం ఇరు పార్టీల చాలెంజ్‌గా మారుతోంది. ఇటీవల మున్సిపాలిటీలో యూఐడీఎఫ్ పనుల అంశం రాజకీయ రంగు పులుముకున్న విషయాన్ని ఈనెల 11న ‘నేతల పంతం...అంతా సతమతం’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెల్సిందే. ఇదే రకమైన పరిస్థితి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి అడ్డంకిగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా.. ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే మౌలిక సూత్రాన్ని మరిచిపోవడం విమర్శలకు దారితీస్తున్నది.
మంత్రి రాక కోసం..
మంత్రి రాక కోసం గజ్వేల్‌లో చెక్కుల పంపిణీని పెండింగ్‌లో పెట్టారనే ప్రచారం సాగుతోంది. చెక్కుల పంపిణీలో చోటుచేసుకుంటున్న తీవ్ర జాప్యంపై విసుగు చెందిన లబ్ధిదారులు ఐఓసీలోని ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట పోస్టర్లు వేసి నిరసన తెలపడం కలకలం రేపింది. తక్షణం అధికారులు స్పందించి చెక్కులు అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
మూడేళ్లుగా ఎదురుచూస్తున్నా
మా కూతురు పెళ్లి తర్వాత 2023లో ‘కల్యాణలక్ష్మి’ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నా. చెక్కు కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఎప్పుడిస్తారో అధికారులు చెప్పడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుడే అవుతుంది.
– మహలక్ష్మి (గిరిపల్లి–గజ్వేల్ మండలం)
ఇబ్బందులకు గురిచేస్తారా?
‘కల్యాణలక్ష్మి’ చెక్కుల కోసం పేదలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. చెక్కులు సిద్ధంగా ఉన్నా పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి.
– సందెబోయిన ఎల్లయ్య,
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
కల్యాణలక్ష్మికి రాజకీయ గ్రహణం
రెండు నెలల క్రితమే చెక్కులు సిద్ధం
అయినా పంపిణీ కాని దుస్థితి
మరికొన్ని రోజులు గడిస్తే
కాలంచెల్లే అవకాశం
లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు


