మార్కెట్ యార్డ్‌లో ధాన్యం ట్రాక్టర్లతో నిరీక్షణ
హుస్నాబాద్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గందరగోళం నెలకొనడంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలల్లోని ఐకేపీ, సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టిన ధాన్యాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌లోని గోదాంలకు తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తుండటంతో దిగుమతిలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇందుకు హమాలీల కొరతే కారణం.
ధాన్యం ట్రాక్టర్లు బారులు
మార్కెట్‌లోని ధాన్యం బస్తాలను కాంటా పెట్టి, గోదాంలలో దిగుమతి చేసేందుకు హమాలీల కొరత ఏర్పడుతోంది. ఉన్న వారితోనే ఒక రోజు కాంటాలు పెట్టడం.. మరో రోజు గోదాంలలో ధాన్యాన్ని దిగుమతి చేస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో ధాన్యం దిగుమతి కాకపోవడంతో బయట నుంచి వస్తున్న ధాన్యం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. సరిపడా హమాలీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీహార్ రాష్ట్రానికి చెందిన హమాలీలను కూడా రప్పించి దిగుమతి చేస్తున్నారు. రోజూ వేలాది ధాన్యం బస్తాలు వస్తుంటే, మార్కెట్‌లో కేవలం 40 మంది హమాలీలే ఉండటంతో రైతులు రోజుల తరబడి మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. మార్కెట్‌లోని రెండు గోదాంలలో ఇప్పటి వరకు 26 వేల క్వింటాళ్ల ధాన్యం బస్తాలను దిగుమతి చేశారు. ఇప్పటికే మూడు గోదాంలలో రెండు నిండిపోయాయి. నేడో, రేపో అదికూడా నిండిపోతే పరిస్థితి ఏమిటనీ రైతులు దిగాలు చెందుతున్నారు.
మాయమవుతున్న ధాన్యం
వ్యవసాయ మార్కెట్‌లో కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు మాయమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో ధాన్యం కుప్పల చుట్టూ బస్తాలు అడ్డు పెట్టి, ఇంటికి వెళ్లి తిరిగి ఉదయం వచ్చి చూడగా ధాన్యం కనిపించడం లేదని వాపోతున్నారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.
గోదాంల వద్ద బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు
ధాన్యం దిగుమతిలో తీవ్ర జాప్యం
మార్కెట్ యార్డులో వందలాది ట్రాక్టర్లు
ఎటు చూసినా వడ్ల బస్తాలే..
ప్రతి గింజా కొంటాం
రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. హమాలీల కొరత ఉండటంతో బీహార్‌కు చెందిన హమాలీలను సైతం రప్పించి దిగుమతి చేయిస్తున్నాం. హుస్నాబాద్, అక్కన్నపేటలో 70 శాతం ధాన్యం కొనుగోలు చేశాం. హుస్నాబాద్‌లోని గోదాంలు సరిపోకపోతే కోహెడ మండల కేంద్రంలోని గోదాంకు తరలిస్తాం.
– లక్ష్మారెడ్డి, తహసీల్దార్, హుస్నాబాద్


