గృహజ్యోతి లబ్ధిదారులకు ఉచితంగా సోలార్‌ | - | Sakshi
Sakshi News home page

గృహజ్యోతి లబ్ధిదారులకు ఉచితంగా సోలార్‌

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

● జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపిక ● ఒక్కో ఇంటిపై రూ.1.38లక్షల వ్యయం ● 2 కిలో వాట్స్‌ ఉత్పత్తి చేసే సోలార్‌ పలకలు రామవరంలో ప్రారంభం

● జిల్లాలో నాలుగు గ్రామాలు ఎంపిక ● ఒక్కో ఇంటిపై రూ.1.38లక్షల వ్యయం ● 2 కిలో వాట్స్‌ ఉత్పత్తి చేసే సోలార్‌ పలకలు

హుస్నాబాద్‌ మండలం రామవరంలో గృహాలపైన ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లేట్లు

పేదల గృహాల్లో సౌర కాంతులు విరజిమ్మనున్నాయి. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మిగులు విద్యుత్‌ విక్రయంతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఇందుకు జిల్లాలో నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు.

– సాక్షి, సిద్దిపేట

ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలి యోజన పథకాన్ని జిల్లాలో అమలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకంలో ఎంపికైన కుటుంబాలకు ఉచితంగా వర్తింప జేసి మిగులు విద్యుత్‌ను టీజీఎస్పీడీసీఎల్‌ కొనుగోలు చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. హుస్నాబాద్‌ మండలంలో రామవరం, వర్గల్‌ మండలం తుంకిఖాల్సా, తొగుట, బుర్గుపల్లిలున్నాయి. అందులో గృహజ్యోతి లబ్ధిదారులు 1,936 లబ్ధిదారులున్నారు. ఒక్కో ఇంటికి 2 కిలో వాట్స్‌ సామర్థ్యం సోలార్‌ ప్లేట్‌లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కిలో వాట్‌కు రూ.68వేలు ఖర్చు చేయనున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో ఇంటికి రూ.1.36లక్షల విలువ చేసే సోలార్‌ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాకు రూ. 26,32,96,000 నిధులతో ఆయా గ్రామాల్లో సోలార్‌ విలేజీగా తీర్చి దిద్దనున్నారు.

గృహం స్లాబ్‌, రేకులతో ఉన్న వాటిని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో తొలి విడతలో హుస్నాబాద్‌ మండలం రామవరం గ్రామంలో 326 గృహజ్యోతి లబ్ధిదారులుండగా అందులో 255 గృహాలు స్లాబ్‌, రేకులవి ఉన్నాయని గుర్తించారు. వీటిలో 135 గృహాలలో సోలార్‌ ప్లేట్లను బిగించడం ప్రారంభించారు. మిగతా మూడు గ్రామాల్లో త్వరలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించనున్నారు.

జిల్లాలో వివరాలిలా ఇలా..

నియోజకవర్గం గ్రామం గృహాలు

హుస్నాబాద్‌ రామవరం 326

గజ్వేల్‌ తుంకిఖాల్సా 624

దుబ్బాక తొగుట 677

సిద్దిపేట బుర్గుపల్లి 309

ఉచితంగానే ఏర్పాటు

గృహజ్యోతి లబ్ధిదారులకు ఉచితంగా సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేయనున్నాం. లబ్ధిదారులు ఒక్క రూపాయి సైతం చెల్లించనవసరం లేదు. ఒక్కో కిలో వాట్‌కు రూ.68వేల చొప్పున రూ.1.36లక్షలను ఖర్చు చేయనున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బును వెచ్చించనున్నాయి.

– రవీందర్‌, మేనేజర్‌, రెడ్కో

Advertisement
 
Advertisement
Advertisement