● రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య ● సుప్రీంకోర్టు తీర్పుతోనైనా అధికారుల్లో మార్పు వచ్చేనా? ● జిల్లా వ్యాప్తంగా సుమారు 19,238 శునకాలు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో వీధి కుక్కల సమస్య తీవ్రమవుతోంది. బాధితుల సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది. అధికారులు సమగ్ర చర్యలు చేపట్టాల్సి ఉండగా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన వీధి కుక్కల బెడదను తొలగించాలి. అవసమైతే కారుణ్య మరణం పరిశీలించాలని సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం విదితమే. వీధి కుక్కల బెడదను రూపుమాపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ఇప్పటికై నా పల్లెలు, పట్టణాల్లో వీధి కుక్కల బెడద తొలిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 508 గ్రామాల్లో సుమారు 19,238 వీధి కుక్కలు ఉన్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. సగటున 12 మంది కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్క కాటుకు ఇంజక్షన్లు వేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వేసవి కాలంలో కుక్కలు క్రూరమైన ప్రవర్తనను కలిగి ఉంటాయని, దీంతో చిన్నారులు, వృద్ధులను టార్గెట్ చేసుకుని కరుస్తాయని పశు వైద్యులు చెబుతున్నారు.
3,700 వాటికి స్టెరిలైజేషన్
వీధి కుక్కలకు సంతాన నియంత్రణ కోసం ఏప్రిల్ 10, 2021న సిద్దిపేట పట్టణంలోని పశు సంవర్ధక ఆస్పత్రి అవరణలో ఏబీసీ(ఎనిమల్ బర్త్ కంట్రోల్) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3,700 కుక్కలకు స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ శస్త్రచికిత్స) చేశారు. ఒక్కో కుక్కకు ఇలా శస్త్ర చికిత్స చేసినందుకు రూ.1,650 కేటాయించాలి. వీటికి సంబంధించి సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబా ద్, చేర్యాల మున్సిపాలిటీలు ఎంఓయూ చేసుకు న్నాయి. కానీ గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చే ర్యాల మున్సిపాలిటీలు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
నిధులు కేటాయించాలి
పల్లెల్లో వీధి కుక్కల సంతాన నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను పల్లెలకు, మున్సిపాలిటీలకు కేటాయించాలి. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయం, నిధులు జీతాలు, మౌలిక వసతుల కల్పనకే సరిపోతున్నాయి.మిగతా పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో ముందుకు వెళ్లడం లేదు.
వ్యాక్సిన్ సైతం వేస్తున్నాం
కుక్కలకు సంతాన నియంత్రణతోపాటు, వ్యాక్సిన్ వేస్తున్నాం. ఊర కుక్కలకు గ్రామ పంచాయతీ, పట్టణాల్లో సిబ్బంది పట్టి తీసుకవస్తే వాటికి సైతం వ్యాక్సిన్ చేస్తాం. వీధి కుక్కల నియంత్రణకు పంచాయతీలు, మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలి.
– గోపాలకృష్ణ మూర్తి,
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి


