● అన్‌లోడింగ్ వేగవంతం చేయండి ● మిల్లర్లకు కలెక్టర్ హైమావతి ఆదేశం
వర్గల్(గజ్వేల్): మిల్లుల్లో వరి ధాన్యం అన్‌లోడింగ్(దిగుమతి) ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి మిల్లర్ యజమానులను ఆదేశించారు. బుధవారం వర్గల్ మండల కేంద్రం శివారులోని శ్రీరామాంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీమహాదేవి ఇండస్ట్రీలలో ధాన్యం దిగుమతి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వస్తున్న ధాన్యాన్ని రెండు, మూడు రోజులపాటు ఆపేసి, జిల్లా నుంచి వచ్చిన లారీలకు ప్రాధాన్యత ఇస్తూ వేగంగా దిగుమతి చేసుకోవాలన్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతమైందని తెలిపారు. అంతే వేగంగా మిల్లులలో అన్‌లోడింగ్ జరగాలని స్పష్టం చేశారు. ఇందుకోసం మిల్లులో ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని, గోదాంలో ఎక్కువ పాయింట్లలో ధాన్యం అన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి మిల్లర్ యజమానులు సహకారం అందించాలని కోరారు. కలెక్టర్ వెంట డీఎస్‌ఓ తనూజ, డీటీ సుజిత, గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం, పీఏసీఎస్ అధికారి జితేందర్‌రెడ్డి, తదితరులున్నారు.
జీఎంఆర్ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ సెంటర్
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోగల ప్రభుత్వ ఆదర్శ గురుకుల (జీఎంఆర్) పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీ కృష్ణారావు మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేనలు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు హెల్ప్‌లైన్ సెంటర్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ సెంటర్ వల్ల పాలిసెట్‌తో పాటు ఎప్‌సెట్, ఐ–సెట్, ఈ–సెట్ తదితర కౌన్సెలింగ్‌ల కోసం, స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


