రైతుల గోస పట్టించుకోరా? | - | Sakshi
Sakshi News home page

రైతుల గోస పట్టించుకోరా?

May 21 2026 10:13 AM | Updated on May 21 2026 10:13 AM

● ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● రైస్‌ మిల్లర్స్‌తో సమావేశం

● ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● రైస్‌ మిల్లర్స్‌తో సమావేశం

దుబ్బాక: ‘ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు.. నెలరోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడం దారుణం.. సీఎం, మంత్రులు ఏం చేస్తున్నట్లు’ అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటను అమ్ముకునేందుకు నరకయాతన పడుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల కొనుగోలు సక్రమంగా లేక కేంద్రాల్లో ఎక్కడికక్కడా ధాన్యం పేరుకపోయిందన్నారు. ఇప్పటి వరకు కనీసం పది శాతం కూడా కొనుగోలు జరగకపోవడంతో రోడ్లపై, కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు, రైస్‌మిల్లర్స్‌ మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. రైస్‌మిల్లర్స్‌ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మిల్లర్స్‌కు అవసరమైన అనుమతులు, రవాణా అంశాల్లో క్లియరెన్స్‌ లేకపోవడం వల్లనే ధాన్యం సేకరణలో ఆలస్యం జరుగుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీరాం సంగీత, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా నాయకులు చింత రాజు, వేణు, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. కాగా మండంలోని రామక్కపేటతో పాటు పలు కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. రైతులు ఇబ్బందులను తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement