హుస్నాబాద్: రైస్ మిల్లులకు తీసుకువచ్చిన ధాన్యాన్ని అన్‌లోడింగ్ చేయడంలో అధికారులు, మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అక్కన్నపేట మండలానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. బుధవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సిద్దిపేట–హనుమకొండ రహదారిపై ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఐకేపీ, సహకార సంఘాల కేంద్రాల్లో కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకువస్తే రోజులు గడుస్తున్న దిగుమతి చేసుకోవడం లేదని మండిపడ్డారు. హుస్నాబాద్ కేంద్రానికి చెందిన ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటూ, అక్కన్నపేట మండలానికి చెందిన ధాన్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అన్‌లోడింగ్ ఆలస్యం కావడంతో ట్రాక్టర్ల అద్దె పెరిగి పోతుందని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి రైతులతో మాట్లాడారు. అన్‌లోడింగ్ వేగిరం చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


