కేంద్రమంత్రికి ఎంపీ రఘునందన్‌రావు వినతి
దుబ్బాక: యాసంగిలో పండిన పొద్దుతిరుగుడు పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రిని బుధవారం ఎంపీ కలిశారు. తెలంగాణలో పొద్దుతిరుగుడు పంట 21,091 నుంచి 27,675 ఎకరాలకు పెరిగిందని, పంట ఉత్పత్తి సైతం 13,935 మెట్రిక్ టన్నుల నుంచి 19,373 మెట్రిక్ టన్నులకు చేరిందని విన్నవించారు. కనీస మద్దతు ధర రూ.7,721 వచ్చేలా చూడాలని కోరారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో గజ్వేల్, సిద్దిపేట, మెదక్ ప్రాంతాల్లో పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు పంట ఎక్కువగా పండిస్తున్నారని తెలిపారు. వెంటనే పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా సంబంధిత శాఖకు సూచించాలని ఈ సందర్భంగా మంత్రికి రఘునందన్‌రావు విన్నవించారు.


