తీవ్ర జాప్యం.. అక్రమాల మయం
మొక్కజొన్న, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్‌ఫెడ్.. వడ్లను కొనుగోలు చేసే సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ), ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ).. ఆముదాలు, పొద్దుతిరుగుడు వంటివి కొనుగోలు చేసే ఆయిల్‌ఫెడ్ సంస్థలు తమ శాశ్వత కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి. ఈ బాధ్యతను పూర్తిగా ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేస్తూ పర్యవేక్షణకే పరిమితమయ్యాయి. ఫలితంగా కొనుగోళ్లు సకాలంలో జరగకపోవడం, అక్రమాలు చోటు చేసుకోవడం సహజపరిణామంగా మారుతోంది. సాక్షి’ పరిశీలనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. – గజ్వేల్
వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు ప్రక్రియ ఏటా సంక్లిష్టంగా మారుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. క్షేత్రస్థాయిలో ఇందుకు కారణాలు విశ్లేషిస్తే ఎన్నో అంశాలు బయటపడుతున్నాయి. వడ్లను గతంలో జిల్లాలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో శాశ్వత కేంద్రాలను నడిపేవారు. కానీ నేడు కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సోసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమైంది. గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేదికాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్నచోట మార్కెటింగ్ శాఖ అధికారులు వసతులు సమకూరుస్తుండగా మిగతాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతోంది.
చేతులెత్తేసిన నాఫెడ్ సంస్థ...
పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన నాఫెడ్(నేషనల్ అగ్రికల్చర్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్)ఈసారి చేతులెత్తిసింది. గత నెల 18వరకు జిల్లాలో కేవలం 1800 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి...ఆ తర్వాత కేంద్రాలను ఎత్తేసింది. ప్రస్తుతం జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో నెల రోజులుగా 3000 మెట్రిక్ టన్నులకుపైగా పొద్దుతిరుగుడు ధాన్యంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇకపోతే మొక్కజొన్న ఉత్పత్తులను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ సైతం కొనుగోళ్లను ఐకేపీ, సహకార సంఘాలకే వదిలేసింది. గతంలో గజ్వేల్‌తోపాటు మరికొన్నిచోట్ల మక్కల కొనుగోళ్లకు సంబంధించి భారీగా అక్రమాలు చోటుచేసుకొని .ఈ వ్యవహారంలో ముగ్గురు ఐకేపీ సిబ్బంది సస్పెండ్ అయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొనుగోళ్ల విధానంలో ప్రభుత్వం ఇప్పటికై నా మార్పులు తెస్తేనే రైతులకు ఇక్కట్లు తీరే అవకాశం ఉంది.
గజ్వేల్ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోళ్లు
ఇప్పటి వరకు 30 శాతమే కొనుగోళ్లు
ఇకపోతే జిల్లాలో యాసంగికి సంబంధించి 3.7లక్షల ఎకరాలకుపైగా వరి సాగులోకి వస్తే...5లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఈ లక్ష్యంలో ఇప్పటివరకు అతికష్టం మీద 30శాతం వరకు కొనుగోళ్లను చేపట్టగలిగారు. ఇంకా 70శాతం కొనుగోళ్లు మిగిలివున్నాయి. జిల్లావ్యాప్తంగా అర్భాటంగా 422కుపైగా సహకార సంఘాలు, ఐకేపీ, మెప్మా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినా కొనుగోళ్లు అనుకున్నంత వేగంగా సాగటం లేదు.
ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేసి..
ప్రభుత్వ రంగ సంస్థలుపర్యవేక్షణకే పరిమితం
ఈసారి పరిస్థితి మరింత అధ్వానం
ధాన్యం అమ్ముకునేందుకురైతుల అష్టకష్టాలు
వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లుఏటా అస్తవ్యస్తం


