ధరల మంట.. పచ్చళ్లు ఎట్ట? | - | Sakshi
Sakshi News home page

ధరల మంట.. పచ్చళ్లు ఎట్ట?

May 18 2026 10:31 AM | Updated on May 18 2026 10:31 AM

ఊరగాయ ఊరిస్తున్నా.. సరుకుల ధరలతో బెంబేలు

సారి అవకాయ పచ్చళ్ల తయారీ సామాన్యులకు పెనుభారంగా మారింది. పచ్చళ్ల సరుకుల ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఏ సరుకు కొనాలన్నా గుబులుపుట్టిస్తున్నాయి. గత ఏడాది కంటే సుమారు 30 నుంచి 40 శాతం వరకు ధరలు పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. ధరలు మండుతుంటే పచ్చళ్లుపెట్టేదెట్టా అంటూ గృహిణులు ఆందోళన చెందుతున్నారు.

దుబ్బాకటౌన్‌: వేసవి కాలంలో ఊరగాయలను తయారు చేసుకోవడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వాటిని తయారు చేయడానికి పలు రకాల సరుకులు అవసరం. కానీ పెరిగిన నిత్యావసర ధరల ప్రభావంతో పచ్చళ్లు పెట్టడానికి మహిళలు జంకుతున్నారు. గతంలో ఒక్కో కుటుంబంలో 100 కాయల వరకు పచ్చళ్లు పెట్టుకునే వారు. కానీ ప్రస్తుతం 25– 50 కాయల వరకే పరిమితమవుతున్నారు. అలాగే మార్కెట్లలో పలు రకాల పచ్చళ్లు రెడీమేడ్‌గా లభిస్తుండటంతో సంప్రదాయంగా వస్తున్న తయారీ ఘననీయంగా తగ్గుతోంది.

సైజ్‌ను బట్టి ధర

మామిడి కాయల్లో అనేక రకాలున్నాయి. ఊరగాయలు పెట్టడానికి కొన్ని రకాలు మాత్రమే ఉపయోగిస్తారు. రసపురి, నాటు మామిడి తదితర రకాల కాయలను వినియోగిస్తారు. వేసవిలో వీటికి డిమాండ్‌ అధికంగా ఉంటుంది. గత సీజన్‌లో రోజుకు రూ. 2 వేలకు పైగా ఆదాయం పొందే రైతులు నేడు రూ.1200 వరకు సంపాదిస్తున్నామని చెబుతున్నారు. కాయ సైజ్‌ మేరకు రూ.15 నుంచి రూ. 25వరకు విక్రయిస్తున్నారు.

కాయలు కొడుతూ..

మండుటెండల్లో వృద్ధ మహిళలు పనికి వెళ్లలేని పరిస్థితి. దీంతో పచ్చళ్లకు మామిడి కాయలను ముక్కలుగా కొట్టడం జీవనోపాధిగా చేసుకుని ఉపాధి పొందుతున్నారు. గతంలో రోజుకు రూ. 1500 వరకు సంపాదించిన వారు పచ్చళ్లు పెట్టే వారు తగ్గడంతో రూ.800 వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. కాయల సైజ్‌లను బట్టి ఒక్కో కాయ కొట్టేందుకు రూ.5 నుంచి రూ.10 వరకు వసూలు చేస్తున్నారు.

ఏం కొనేటట్టులేదు..

మా కుటుంబ సభ్యులకు ఊరగాయ అంటే చాలా ఇష్టం. ప్రతీ ఏటా పచ్చళ్లు తయారు చేస్తాం. ప్రస్తుతం నిత్యావసర సరకుల ధరలు మండి పోతున్నాయి. దీంతో ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం ప్రకారం పరిమిత కాయలతోనే ఊరగాయ పెట్టుకుంటున్నాం. – లక్ష్మి, గృహిణి

చాలా తగ్గింది

ప్రతీ వేసవిలో మామిడి కాయలను ముక్కలుగా చేస్తూ జీవనం సాగిస్తుంటా.. రోజుకు రూ.600 నుంచి 800 సంపాదిస్తా. గతంతో పోలిస్తే ఈసారి చాలా తగ్గింది.

– కనకవ్వ, బల్వంతాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement