ఆదాయం పెంపుపై దృష్టేదీ? | - | Sakshi
Sakshi News home page

ఆదాయం పెంపుపై దృష్టేదీ?

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

ఇంటి పన్నుల అసెస్మెంట్‌పై కానరాని శ్రద్ధ

గజ్వేల్‌: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆదాయ పెంపు మార్గాలపై దృష్టి కరువైంది. ఆయా మున్సిపాటీల్లో ప్రస్తుతం వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను అసెస్మెంట్‌ చేయడం ద్వారా ఏటా లక్షల్లో ఆస్తి పన్ను రూపంలో ఆదాయం సమకూరే అవకాశమున్నా.. ఆ దిశగా చర్యలు సాగడం లేదు. ఫలితంగా ఏటా భారీగా రాబడికి గండిపడుతోంది.

పెరుగుతున్న జనాభా అవసరాలకనుణంగా ఆదాయాన్ని పెంచుకొని.. మెరుగైన వసతులను కల్పించాలనే మౌలిక అంశాన్ని మున్సిపాలిటీల్లో యంత్రాంగం మరిచిపోతున్నది. ఫలితంగా పట్టణాల్లో ప్రజలు అరకొర సౌకర్యాల మధ్య కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సిద్దిపేటతోపాటు గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట ఏటా రూ.18కోట్లకుపైగా ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నది. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ రూ.4కోట్లకుపైగా ఆదాయంతో రెండోస్థానంలో ఉండగా.. మిగతా మున్సిపాలిటీలు రూ. 2–3కోట్లలోపు ఆదాయంతో తర్వాత స్థానాలను ఆక్రమిస్తున్నాయి.

వేల సంఖ్యలో పెండింగ్‌

మున్సిపాలిటీల్లో కొత్తగా ఇంటి నంబర్లు ఇచ్చి ఆస్తి పన్ను జనరేట్‌ చేయాల్సినవి అన్ని మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేకించి గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, సంగుపల్లి, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌, క్యాసారం, రాజిరెడ్డిపల్లి గ్రామాలు ఉండగా.. కొత్తగా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సుమారుగా 5వేల ఇళ్లతో విలీనమైంది. వీరికి ఇంటి నంబర్లు ఇవ్వాల్సి ఉన్నది. నిజానికి ఈ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ 2026 జనవరిలో అధికారికంగా విలీనమైతే.. వీరికి 2023కు పూర్వం నుంచే ఇంటి పన్నులు వేశారు. కానీ విలీనమైన తర్వాతే పన్నులు చెల్లిస్తామని...అంతకు పూర్వం భారం మేయలేమని నిర్వాసితులు చెబుతున్నారు. ఈ సమస్యను కొలిక్కి తెచ్చి నిర్వాసితులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ శాసీ్త్రయ పద్ధతిలో పన్నులను వసూలు చేయాల్సి ఉన్నది. ఇకపోతే పట్టణంలోని డబుల్‌ బెడ్రూమ్‌ మోడల్‌ కాలనీలో 1200 పైగా ఇళ్లు ఉన్నాయి. సింహభాగం ఇళ్ల కేటాయింపు జరగగా వాటికి సైతం ఇంటి నంబర్లు ఇచ్చి.. మెరుగైన సేవలను అందించాల్సి ఉంది. ఇకపోతే పట్టణంలోని కొత్త కాలనీల్లో మినహా మిగతా చోట్ల వందల సంఖ్యలో వేరుపడిన కుటుంబాలకు కొత్త ఇంటి నంబర్లు ఇవ్వాల్సి ఉన్నది. దీనిపై ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ఆదాయం పెంచుకోవాల్సిన అవసరమున్నది. మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ప్రాపర్టీ టాక్స్‌ తగ్గించాలని ఆయా మున్సిపాలిటీల్లో ఎంతోమంది దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఈ ప్రక్రియను శాసీ్త్రయంగా చేపట్టాల్సిన అధికారులు...మామూళ్ల మత్తులో ఇష్టానుసారంగా చేపట్టి మున్సిపల్‌ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

వేల సంఖ్యలో పెండింగ్‌

రాబడికి ఏటా భారీగా గండి

జిల్లాలోని మున్సిపాలిటీల దుస్థితి

Advertisement
 
Advertisement
Advertisement