చేర్యాల(సిద్దిపేట):తాలు పేరుతో మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారు. క్వింటాలుకు నాలుగు కిలోల మేర కట్ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచనిస్థితికి గురవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి, ఇరవై రోజులుగా పడిగాపులు కాసి, తాలుపట్టి చివరకు కాంటా వేసినా.. మళ్లీ తాలు ఉందంటూ మిల్లర్లు కోత పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. మండల పరిధిలోని నాగపురి ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి గురువారం రామలింగేశ్వర రైస్ మిల్లుకు రెండు లారీల ధాన్యం పంపించారు. లారీలో వచ్చిన ధాన్యాన్ని మిల్లర్ చెక్ చేశారు. తాలు ఎక్కువగా ఉందని, క్వింటాలుకు నాలుగున్నర కిలోలు కట్ చేస్తామని కేంద్రం నిర్వాహకులకు సమాచారం అందించారు. సదరు నిర్వాహకులు రైతులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రైతులు మిల్లు వద్దకు వెళ్లి చెక్ చేయగా 500 గ్రాముల ధాన్యంలో 16 గ్రామల నుంచి 20 గ్రాములు, మరో లారీలో 500 గ్రాములకు 32 గ్రాముల తాలు వచ్చినట్లు గుర్తించారు. తాలు చాలా తక్కువగా ఉన్నా ఎక్కువ ఉందని మిల్లర్ చెబుతున్నారని రైతులు తెలిపారు. చివరగా సదరు మిల్లరు ఒక లారీలో 4 క్వింటాళ్లు, మరో లారీలో 9 క్వింటాళ్ల ధాన్యం కట్ చేస్తామంటూ తెలిపినట్లు రైతులు వాపోయారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన యంత్రాలతో శుభ్రం చేసినా మళ్లీ తాలు కట్ చేయడం సరికాదన్నారు. మిల్లర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


