హుస్నాబాద్: బంకుల్లో డీజిల్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీజిల్ నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలో 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రెండు రోజుల నుంచి డీజిల్ కొరత నెలకొంది. బంకు యాజమానులు డీజిల్ కోసం అడ్వాన్స్ పేమెంట్ చేసినా చమురు కేంద్రాల నుంచి దిగుమతి కావడం లేదు. వరి కోతల సమయంలో హార్వెస్టర్లకు డీజిల్ అత్యవసరం. రోజూ ప్రతి హార్వెస్టర్‌కు దాదాపు 100 నుంచి 150 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. దీంతో వరి కోత మిషన్లు వ్యవసాయ క్షేత్రంలోనే ఉండాల్సి పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. గతంలో కొంత మంది అవసరానికి మించి డీజిల్‌ను నిలువ చేసుకొని, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరో వైపు పెట్రోల్ కొరత ఉంటుందనే వదంతులతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. ముందస్తుగా వాహన ట్యాంక్‌లను నింపుకొంటున్నారు.


