గ్రిల్స్ ఏర్పాటు చేయాలి
వందల ఏళ్లుగా పూజలు అందుకుంటున్న గంగిరేణి చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. చెట్టుపై బంతిపూల దండలు పడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. భక్తులు వేసిన దండలను రోజూ తీసివేయాలి. దండలు చెట్టుపై కాకుండా మొదట్లో వేసేలా చర్యలు చేపట్టాలి.
– కటకం అమరేందర్ స్థానికుడు
రక్షణ చర్యలు చేపడతాం
ఇటీవల మూడు నెలలపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. లక్షాలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణి చెట్టుపై బంతి పూల దండలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో చెట్టు ఎండిపోతోంది. వాటిని తొలగించి రక్షణచర్యలు చేపడతాం. – కృష్ణ ప్రసాద్, ఆలయ ఈఓ
దేవుని చెట్టుకు ఏమైంది?
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో దేవుని చెట్టుగా పిలువబడే గంగిరేణి వృక్షం మోడుబారుతోంది. భక్తులు వేసిన పూల దండలు తొలగించకపోవడమే కారణమని పలువురు వాపోతున్నారు. నిత్యం స్వామి దర్శనానికి వచ్చే భక్తులు.. ఆలయ ప్రాంగణంలోని గంగిరేణి చెట్టుపై బంతి పూల దండలు వేసి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించి ముడుపులు కడుతుంటారు. ఇలా నిత్యం వేలాది పూల దండలను చెట్టుపై వేస్తుండటంతో కొమ్మలన్నీ చిగురించకపోగా చెట్టంతా మోడుబారుతుంది. వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా కళకళలాడే వృక్షం పూల దండలు వేయడం వల్లే ఇలా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. భక్తులు వేసిన పూలదండలను నిత్యం ఆలయ సిబ్బంది తొలగించాలి. కానీ అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో వృక్షం కళావిహీనంగా మారుతోంది. ఇప్పటికై నా అధికారులు పరిరక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
మోడుబారుతున్న గంగిరేణి వృక్షం
పూలదండలు తొలగించకపోవడమే కారణమా?
రక్షణ చర్యలు తీసుకోవాలనికోరుతున్న భక్తులు


