తాటి ముంజలు తిని.. సేదతీరి..
● మంత్రి పొన్నం ప్రభాకర్
● ‘అర్బన్ పార్కు’ పురోగతిపైఅధికారులకు దిశానిర్దేశం
హుస్నాబాద్‌రూరల్: మండల పరిధి జిల్లెలగడ్డ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్కు పనులను వేగిరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం అటవీ ప్రాంతంలోని పార్కు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల పార్కు వేగంగా పూర్తి చేయాలని, ఎత్తయిన గుట్టలపై వాచ్ టవర్స్ నిర్మించాలన్నారు. గాడిదల లొద్ది, పుట్ట లొద్ది మధ్య ట్రాకింగ్ వంతెన నిర్మించాలని చెప్పారు. అంతకు ముందు కూచనపెల్లి మర్రివాగుపై రూ.21.10 లక్షలతో నిర్మించే చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాల అభివృద్ధితో పాటు, వ్యవసాయానికి సాగు నీరు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ రాములు, ఆర్డీఓ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
కూరగాయల సాగుతో అధిక లాభాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): కూరగాయల పండిస్తే అధిక లాభాలను పొందవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు సూచించారు. పోతారం(జే) గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు కూరగాయల పెట్టెలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులందరూ కూరగాయలు, ఆయిల్‌పామ్, పట్టు పరిశ్రమ, తేనెటీగలు, వంటి ఆదాయాన్ని ఆర్జించే పంటలను వేయాలన్నారు. మండల కేంద్రంలో ఆయిల్ ఫాం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా హుస్నాబాద్‌లో వెజిటేబుల్ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని, స్థల పరిశీలన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రాలుగా చెరువులు
హుస్నాబాద్: చెరువులను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువులతో పాటుగా మినీ స్టేడియం, పలు అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటి కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ట్రాన్స్‌జెండర్లకు ఈఆర్‌సీ కింద ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ వ్యర్థ జలాలు కొత్త చెరువులో కలవకుండా నేరుగా ప్రత్యేక ఫీడర్ కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
హుస్నాబాద్: మండుటెండల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి ముంజలు తింటూ కొద్ది సేపు సేద తీరారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణ శివారులో తాటి ముంజలు అమ్ముతున్న చిరువ్యాపారులను మంత్రి పలకరించారు. అమ్మకాలు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు తాటి ముంజలు చాలా మేలు చేస్తాయన్నారు.


