సత్తా చాటిన గురుకులం | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన గురుకులం

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

సాక్షి, సిద్దిపేట: ఇంటర్మీడియెట్‌ ఫలితాలలో జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌లో రాష్ట్రంలో 29వ స్థానం, ద్వితీయ సంవత్సరం 31 స్థానానికి దిగజారింది. ఇంటర్మీడియెట్‌ బోర్డు ఆదివారం మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఫస్ట్‌ ఇయర్‌లో 54.97శాతం, సెకండియర్‌లో 64.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఈ సారి సైతం బాలికలదే పైచేయిగా నిలిచింది.

70శాతం మంది బాలికలు ఉత్తీర్ణత

జిల్లా వ్యాప్తంగా 18,822 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,183(59.41శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 3,747(45.42శాతం), బాలికలు 7,436 (70.33శాతం) ఉత్తీర్ణత సాధించారు. దీంతో బాలికలే పైచేయిగా నిలిచారు. ప్రైవేట్‌లో సెకండియర్‌ జనరల్‌ విద్యార్థులు 1,023 మంది పరీక్ష రాయగా 302 మంది, ఓకేషనల్‌లో 196 మంది పరీక్ష రాయగా 111 మంది పాస్‌ అయ్యారు. గత సంవత్సరం ఫస్ట్‌ ఇయర్‌లో 51.5శాతంతో రాష్ట్రంలో 30వ స్థానం, సెకండియర్‌లో 59.6శాతంతో 31స్థానంలో ఉండగా ఈ సారి మొదటి సంవత్సరంలో 29వ స్థానం వచ్చింది. గతంతో పోలిస్తే ఒక స్థానం ముందుకు వచ్చింది. ద్వితీయ సంవత్సరం గత స్థానానికే పరిమితం కావడం గమనార్హం.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో

48శాతమే..

జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలిపి 4,857 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,337(48.11శాతం) మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 2,545 మంది పరీక్ష రాయగా 1,101(43.26శాతం) మంది, ద్వితీయ సంవత్సరం 2,312 మంది పరీక్ష రాయగా 1,236(53.46శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌లో 20శాతం లోపు తొగుట, మిరుదొడ్డి, ములుగు, దౌల్తాబాద్‌, జగదేవ్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, సెకండియర్‌లో నంగునూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 51 మంది విద్యార్థులు పరీక్ష రాయగా కేవలం ఐదుగురు మాత్రమే పాస్‌ అయ్యారు. అత్యధికంగా సెకండియర్‌లో చిన్నకోడూరు జూనియర్‌ కళాశాలలో 83.33శాతం, ఫస్ట్‌ ఇయర్‌లో కోహెడ జూనియర్‌ కళాశాలలో 66.92శాతం మంది పాసయ్యారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఉత్తీర్ణత 50శాతం సైతం దాటకపోవడం గమనార్హం.

సిద్దిపేటఅర్బన్‌: ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల, మిట్టపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఎన్సాన్‌ పల్లి రెసిడెన్షియల్‌ గురుకుల విద్యార్థులు ఎంపీసీ సెకండియర్‌లో పి.అర్చన 994, అమూల్య 992, డి.అర్చన 991 మార్కులు సాధించారు. బైపీసీ సెకండియర్‌లో ఎం. పల్లవి 978, నిధి బిహారి 974, వి.అమూల్య 973 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఎన్సాన్‌ పల్లి కళాశాల ప్రిన్సిపల్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement