● కాంగ్రెస్‌కు, బీజేపీకి బుద్ధిచెప్పాల్సిందే
● మాజీమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ‘మీ కష్టసుఖాల్లో అండగా ఉన్నా.. ఈ ప్రాంత ప్రతిష్ట, గౌరవాన్ని కాపాడాను.. మన సిద్దిపేట అంటే సీఎం రేవంత్‌కు కళ్లమంట..అందుకే నిధులను ఆపేశారు. పట్టణాన్ని మనమే రక్షించుకోవాలి’ అని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి రెండున్నర ఏళ్లలో ఒక్క పని చేయలేదని విమర్శించారు. సిద్దిపేటకు మంజూరైనా నిధులను ఆపి, వెటర్నరీ కళాశాలను తరలించారన్నారు. కోమటి చెరువు వద్ద శిల్పారామం పనులను సగంలోనే నిలిపివేశారని ఆరోపించారు. వెయ్యి పడకల ఆస్పత్రి పనులు 90శాతం పూర్తయినా మిగతా 10శాతం పూర్తి చేసే కనీస బాధ్యత లేదన్నారు. రేపు బల్దియా ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మీ దగ్గరకు వస్తే వారి మాయమాటలు, డబ్బుల ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో భగీరథ నీటిని ఫిల్టర్ చేసే స్థాయిలో కూడా ప్రభుత్వం లేదని విమర్శించారు. సిద్దిపేటకు రెండు పార్టీలు చేసింది ఏమిటని నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, సీనియర్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, సంపత్ రెడ్డి, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు.


