పార్కింగ్‌కు ఇక పైసా వసూల్‌ | - | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌కు ఇక పైసా వసూల్‌

Mar 24 2026 8:59 AM | Updated on Mar 24 2026 8:59 AM

● ప్రతీ వాహనానికి రూ.50 నుంచి రూ.100 ఫీజు వసూలుకు చర్యలు ● నాలుగు చోట్ల ‘గేట్లు’ ఏర్పాటు చేసే యోచనలో పంచాయతీ ● ఇప్పటికే పాలకమండలి తీర్మానం ● టెండర్‌ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం

కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఇక ఆర్థిక భారమే
● ప్రతీ వాహనానికి రూ.50 నుంచి రూ.100 ఫీజు వసూలుకు చర్యలు ● నాలుగు చోట్ల ‘గేట్లు’ ఏర్పాటు చేసే యోచనలో పంచాయతీ ● ఇప్పటికే పాలకమండలి తీర్మానం ● టెండర్‌ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఆర్థిక భారం తెప్పేలా లేదు. ఆటో, నాలుగు చక్రాల వాహనాలపై వచ్చే భక్తులకు ఫీజు వసూలు చేసేందుకు కొమురవెల్లి పంచాయతీ సిద్ధమైంది. ఇందుకు కసరత్తు చేస్తోంది. పాత కమాన్‌ నుంచి వచ్చే భక్తులకు మల్లన్న చెరువు మత్తడిలో, హన్మకొండ నుంచి వచ్చే భక్తులకు కిష్టంపేట రోడ్డులో ఉన్న గోశాల వద్ద, తిమ్మారెడ్డిపల్లి కమాన్‌ నుంచి వచ్చే వారికి పోలీస్‌స్టేషన్‌, రాంసాగర్‌ రోడ్డు నుంచే వచ్చే భక్తులకు కురుమ సత్రం వద్ద ఫీజు వసూలు చేసేలా గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతి రాగానే టెండర్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి వాహనానికి రూ.50నుంచి రూ.100 వసూలు చేయనున్నట్లు సమాచారం. దీంతో భక్తులపై మరింత ఆర్థిక భారం పడనుంది.

పార్కింగ్‌కు స్థల మేదీ?

కొమురవెల్లిలోకి వచ్చిన వాహనాలకు సరిపడా పార్కింగ్‌ స్థలం పంచాయతీకి లేదు. ప్రస్తుతం ఆలయ పరిసరాలలో ఉన్న ప్రయివేట్‌ వెంచర్లలో ఫ్రీగా భక్తులు పార్కింగ్‌ చేస్తున్నారు. ఫీజు వసూలు చేస్తే ప్రయివేటు వ్యక్తులు తమ వెంచర్లలోకి వాహనాలను అనుమతించక పోవచ్చు. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి, ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా వాహన ఫీజుపై పునరాలోచించాలని స్థానికులు కోరుతున్నారు.

స్థానికులకు ఇబ్బందే..

వాహన ఫీజు వసూలు చేసేందుకు గేట్లు ఏర్పాటు చేస్తే స్థానికులకు సైతం ఇబ్బందులే.. మండలంలోని గురువన్నపేట, పోసన్‌పల్లి, అయినాపూర్‌, తపాస్‌పల్లి వారు చేర్యాలకు.. చేర్యాలనుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు తిప్పలు తప్పవు

మల్లన్నను దర్శించుకున్న సీపీ

కొమురవెల్లి మల్లికార్జున స్వామిని పోలీస్‌కమిషనర్‌ రష్మీపెరుమాళ్‌ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాన్ని, శేషవస్త్రాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement