అసెంబ్లీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీతో పాటు కాలువల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఇరిగేషన్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లకు సంబంధించి 90 శాతానికి పైగా కాలువల నిర్మాణాలు పూర్తికాగా ఇంకా 10 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దీంతో పంటలకు నీరందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పరిపల్లి కెనాల్‌తో పాటు పలు కాలువలు భూసేకరణ, కోర్టు సమస్యతో మధ్యలోనే ఆగిపోయాయన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు దృష్టిసారించి సమస్యను పరిష్కరిస్తే వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని పునరుద్ధరించి చెరువులను అభివృద్ధి చేయాలని కోరారు.


