‘యాంత్రీకరణ’ ముసుగులో మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

‘యాంత్రీకరణ’ ముసుగులో మాయాజాలం

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

సబ్సిడీ ద్వారా అందజేసిన రొటోవేటర్లు

వ్యవసాయ యాంత్రీకరణ ముసుగులో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. సబ్సిడీ పరికరాలను బహిరంగ మార్కెట్‌ ధర కంటే అధిక ధరలకు అందజేస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు.. అధికారులు కుమ్మకై ్క అక్రమాలకు తెరలేపారు. ఒక్కో రొటోవేటర్‌కు రైతులు రూ.19వేలు అధికంగా చెల్లిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు రూ.4.34కోట్లు మంజూరయ్యాయి. – సాక్షి, సిద్దిపేట

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 42 బ్లేడ్‌లు, ఆరు ఫీట్ల రొటోవేటర్‌ను రూ.1.34,060 అందజేస్తున్నారు. ఇందులో రైతు రూ.84,060 చెల్లిస్తుండగా ప్రభుత్వం సబ్సిడీ రూ.50వేలు అందిస్తోంది. ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న రొటోవేటర్‌ అదే బహిరంగ మార్కెట్‌లో ఎంత ధర ఉందని ‘సాక్షి’ పరిశీలించింది. దానికి సంబంధించి సబ్సిడీ పరికరాలు అందించే ఏజెన్సీ నుంచే కొటేషన్‌ను సాక్షి సేకరించింది. ఒక్కో రొటోవేటర్‌ను రూ.1,20,000 అని, దాదాపు రూ.5వేల వరకు తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. అంటే బహిరంగ మార్కెట్‌లో రూ.1.15లక్షలకు మాత్రమే లభిస్తుంది. బహిరంగ మార్కెట్‌లో పరికరాలు తీసుకున్న రైతులను అడగ్గా రూ.1.05లక్షలకే అందజేస్తున్నారని చెబుతున్నారు. దీని ప్రకారం సాక్షి సేకరించిన కొటేషన్‌ ప్రకారం చూస్తే ఒక్కో రొటోవేటర్‌కు దాదాపు రూ.19వేలు అధికంగా చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అందించే సబ్సిడీలో కేవలం రూ.34వేలు మాత్రమే అందుతోంది.

ప్రభుత్వ సొమ్మేకదా అని అప్పనంగా దోచేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నారు. వీటి కోసం జిల్లాకు రూ.4.34 కోట్లు మంజూరయ్యాయి. బహిరంగ మార్కెట్‌ కంటే సబ్సిడీ ద్వారా అందించే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అధిక ధరలకు ఇవ్వడం గమనార్హం. బహిరంగ మార్కెట్‌లో లభించే ధరలకే సబ్సిడీ ద్వారా అందించే పరికరాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.

ఇప్పటి వరకు రూ.1.52కోట్ల

సబ్సిడీతో పరికరాలు

వ్యవసాయ యాంత్రీకరణలో అందజేసే పరికరాల కోసం జిల్లాకు రూ. 4.34కోట్లు మంజూరు కాగా జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటి వరకు రూ. 1.52కోట్ల సబ్సిడీతో 152 రొటోవేటర్లు, గడ్డి కట్టే యంత్రాలు 6, పవర్‌ స్ప్రేలు 56, బ్రష్‌ కట్టర్లు 5, పవర్‌ వీడర్స్‌ 6 అందజేశారు.

ఏజెన్సీ నిర్వాహకులు.. అధికారులు కుమ్మక్కు

ఒక్కో రొటోవేటర్‌కు రూ.19వేలు అధికంగా వసూలు

‘సాక్షి ’ పరిశీలనలో తేలిన వైనం

కలెక్టర్‌ దృష్టి సారించాలని కోరుతున్న రైతులు

జిల్లాకు ‘వ్యవసాయ యాంత్రీకరణ’ కింద రూ.4.34కోట్లు మంజూరు

ధరలతో సంబంధంలేదు

వ్యవసాయ యంత్రీకరణ పరికరాలకు సంబంధించి ధరలు ఇక్కడ నిర్ణయించినవి కావు. కమిషనర్‌ స్థాయిలో నిర్ణయించిన వాటి ప్రకారమే సబ్సిడీ పోను మిగతా వాటిని డీడీ రూపంలో స్వీకరిస్తున్నాం. ధరల నిర్ణయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు.

– స్వరూప రాణి, జేడీఏ

ఎక్కువ మొత్తంలో పరికరాలు తీసుకున్నప్పుడు తక్కువ ధరకు ఇవ్వాల్సింది పోయి మార్కెట్‌ ధర కంటే ఎక్కువ డబ్బుకు అందజేస్తున్నారు. పరికరాలు అందజేసే ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులు కుమ్మకై ్క ధరను పెంచారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో రొటావేటర్‌పై రూ.19వేలు అధికంగా చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రోటవేటర్లు 156 మందికి అందజేయగా దాదాపు రూ.29.73లక్షలు చేతులు మారినట్లు తెలుస్తోంది. అంటే ఒక్క రొటావేటర్‌కే ఇంత పెద్ద మొత్తంలో చేతుల మారగా ఇంకా మిగతా వాటిపై ఎంత అధికంగా చెల్లించారో తెలియాల్సి ఉంది. ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందించి మేలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement