మంచినీటి పన్ను ఇక ఆన్‌లైన్‌ | - | Sakshi
Sakshi News home page

మంచినీటి పన్ను ఇక ఆన్‌లైన్‌

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

గజ్వేల్‌: మంచినీటి పన్నుల వసూళ్లపై మున్సిపల్‌ అధికారులు దృష్టి పెట్టారు. ఈ పన్నులను ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకొచ్చారు. గతంలో ఆఫ్‌లైన్‌ విధానం అమల్లో ఉన్న సమయంలో రూ.కోట్లల్లో బకాయిలు పేరుకుపోయాయి. కొత్త విధానంలో బాకాయిలన్నీ వసూలు చేయాలని మున్సిపల్‌ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పరిణామం ఆయా పట్టణాల ప్రజలకు భారంగా మారనుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ కొత్త విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట మున్సిపాలిటీ మినహా మిగతావి 2012 తర్వాత పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయినవే. మున్సిపాలిటీ నిర్వహణకు ప్రధాన ఆధారమైన పన్నుల విధానం ఒక్కోచోట ఒక్కో రకంగా అమల్లో ఉంది. సిద్దిపేట మినహా అన్ని చోట్లా మంచినీటి పన్నులను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. నిజానికి మంచినీటికి కూడా పన్ను కట్టాలని ఆయా పట్టణాల ప్రజలకు తెలియదు. పంచాయతీల నేపథ్యం నుంచి వచ్చిన గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లో మంచినీటి పన్ను వసూలు చేయొద్దని వినతులు చేస్తూ వస్తున్నారు. కొద్దిశాతం మంది మాత్రమే ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు జరుపుతున్నారు. దీనివల్ల ఆయా మున్సిపాలిటీల్లో మంచినీటి పన్నుల బకాయిలు కోట్లల్లోకి చేరుకున్నాయి.

గజ్వేల్‌లో రూ.4.32కోట్ల బకాయిలు

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలోనాలుగేళ్లుగా రూ.4.32కోట్ల మంచినీటి పన్నుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఈసారి అధికారులు రూ. 3.80లక్షలు వసూలు చేశారు. కాగా ఇంకా రూ.3.94కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే ఈ మున్సిపాలిటీకి 12891 ఇండ్ల ద్వారా ఏటా రూ.5.79కోట్ల ఆస్తి పన్ను ఆదాయం సమకూరుతున్నది. ఆస్తి పన్నుతోపాటు మంచినీటి పన్ను కూడా ప్రధాన వనరుగానే మారింది. కాగా ‘మిషన్‌ భగీరథ’ పథకానికి గజ్వేల్‌ నియోజకవర్గమే పుట్టినిల్లు. గజ్వేల్‌ మండలం కోమటిబండ వద్ద 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ‘మిషన్‌ భగీరథ’ తొలి ఫలాలను అందుకున్నది కూడా ఈ ప్రాంతమే. తమకు నిరంతరం ఉచితంగా మంచినీటి పంపిణీ జరగనుందని ప్రజలు భావించారు. కానీ మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పథకం నిర్వహణ బాధ్యతను మున్సిపల్‌ అధికారులకే అప్పగించడంతో...పన్నుల భారం తప్పడం లేదు. ఈ పన్నులను ఎలాగైన వసూలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

రూ.కోట్లల్లో పేరుకుపోయిన బకాయిలు

వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి

అన్ని మున్సిపాలిటీల్లోనూ అమలయ్యేలా చర్యలు

ఆస్తి పన్నుతోపాటు..

ప్రస్తుతం ఆస్తి పన్నులతోపాటు మంచినీటి పన్నును సైతం వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న మంచినీటి పన్నును ప్రస్తుతం చెల్లించాల్సిందేనని ఒత్తిడి మొదలుకావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటగోపాల్‌ను వివరణ కోరగా...మంచినీటి పన్ను ఇటీవలే ఆన్‌లైన్‌ చేశామని, ప్రజలు సకాలంలో ఈ పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement