పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కేసీఆర్‌, హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌గా సురేశ్‌గౌడ్‌ రేపు ఉగాది కవిసమ్మేళనం నానో యూరియాపై అవగాహన తప్పనిసరి

సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్న కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో టెన్త్‌ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 500మీటర్ల వరకు ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ దన్నారు. సమీపంలోని అన్ని జీరాక్స్‌ సెంటర్లు మూసివేసి ఉంచాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): అసంపూర్తిగా ఉన్న కాలువులు పూర్తి చేయడంతో గురువారం రైతులు మండల పరిధిలోని గంగాపూర్‌ శివారులో మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించే కాలువలు కొన్నెళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన హరీశ్‌రావు.. సొంత డబ్బుతో కాలువలు తవ్వించి నీటిని తరలించారు. దీంతో గంగాపూర్‌, గుర్రాలగొంది గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.

మద్దూరు(హుస్నాబాద్‌): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌గా మండలానికి చెందిన బొంగోని సురేశ్‌గౌడ్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సురేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం మీడియా ప్యానలిస్ట్‌గా నియమించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. పార్టీ బలోపేతం కోసం, ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకురావడంలో, పార్టీ విధానాలను ప్రజలకు వివరించడంలో బాధ్యతగా నిర్వర్తిస్తానని తెలిపారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఉదయం 10గంటలకు ఉగాది కవిసమ్మేళనం నిర్వహించనున్నట్లు వెన్నెల సాహితీ సంగమం అధ్యక్షుడు వంగర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్కపెల్లి యాదగిరిలు గురువారం తెలిపారు. కార్యక్రమానికి ప్రముఖకవి, రచయిత కోడం పవన్‌కుమార్‌, విశిష్ట అతిథులుగా ప్రముఖకవి, రచయిత, తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండిమల్లారెడ్డి, ఆత్మీయ అతిథిగా సొప్పదండి విద్యాసాగర్‌లు హాజరవుతారన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు అందెశ్రీ ఉగాది పురస్కారం, జ్ఞాపికలు అందించనున్నట్లు తెలిపారు.

మిరుదొడ్డి(దుబ్బాక): నానో యూరియాపై ప్రతి రైతు అవగాహన పెంచుకోవాలని ఏఆర్‌ఎస్‌ తోర్నాల శాస్త్రవేత్త రమాదేవి అన్నారు. గురువారం మండల పరిధిలోని చెప్యాల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అణుగుణంగా రైతులు ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి సారించాలని సూచించారు. రసాయన ఎరువుల మోతాదును తగ్గించి సేంద్రియ ఎరువులతో దిగుబడులు సాధించేలా రైతులు ముందడుగు వేయాలని కోరారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రతి రైతుకు అవగాహన కలిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement