ప్రజాసేవే లక్ష్యంగా పని చేయండి | - | Sakshi
Sakshi News home page

ప్రజాసేవే లక్ష్యంగా పని చేయండి

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

సాక్షి, సిద్దిపేట: ప్రజాప్రతినిధులు ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం సిద్దిపేటలో రెడ్డి సంక్షేమ సంఘ భవనంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై మున్సిపల్‌ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం కలెక్టర్‌ హైమావతి అధ్యక్షత జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా బక్కి వెంకటయ్య హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితర రంగాల్లో అవగాహన కార్యక్రమాలను అమలు చేసిందని గుర్తు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెల్లో, పట్టణాల్లో అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించగకుండానే బిల్లులకు ఆమోదం తెలుపుతున్నారన్నారు. ఏదైనా భవనం నిర్మిస్తే డోర్‌లు, కిటికీలు సరిగ్గా ఉన్నాయా? లేదా? అని కూడా ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు పరిశీలించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో చిన్న చిన్న విద్యుత్‌ స్తంభాలు ఉండటంతో వైర్లు కిందికి వేలాడుతున్నాయన్నారు. ఏదైనా గ్రామంలో విద్యుత్‌ మర్మతులు చేపట్టినప్పుడు ఆ ఒక్క గ్రామానికి ప్రత్యేకంగా బ్రేకర్‌ లేకపోవడంతో నాలుగు గ్రామాల్లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతుందన్నారు. గ్రామాల్లో స్ట్రీట్‌ లైట్లు ఆన్‌ ఆఫ్‌ స్వీచ్‌లు లేకపోవడంతో నిరంతరంగా వెలుగుతున్నాయన్నారు. ప్లాస్టిక్‌ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ హైమావతి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని ఐదు అంచెల్లో అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఆర్‌ఓ ప్లాంట్ల నీటి కంటే మిషన్‌ భగీరథ నీటిని తాగడం చాలా మంచిదన్నారు. తాను మిషన్‌ భగీరథ నీటినే వేడి చేసి చల్లార్చి తాగుతున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా, వైద్యం, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పౌరసరఫరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్‌ నిర్మూలన, శాంతి భద్రతలు, విద్యుత్‌, పర్యావరణం, ఇందిరమ్మ గృహాల పై తమ శాఖలకు సంబంధించిన అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టిసారించాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ వెంకటయ్య

‘ప్రగతి ప్రణాళిక’పై అవగాహన కార్యక్రమం

క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించకుండానే బిల్లులా?: ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement