పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో ఎల్‌పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా గ్యాస్ కొరత మరింత వేధిస్తోంది. పట్టణాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, వాహనాలకు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడే స్థితికి వచ్చాయి. ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో యజమానులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట
హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రైవేట్, ప్రభుత్వం సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో పలువురు ప్రైవేట్ గ్యాస్ వ్యాపారులు బ్లాక్‌లో విక్రయాలకు తెరలేపారు. ప్రైవేట్ కంపెనీకి చెందిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 19 కేజీలది గతంలో రూ.1,850లకు డెలవరీ చేసేవారు. ప్రస్తుతం రూ.3వేలకు విక్రయిస్తున్నారు. గ్యాస్ లేకపోతే హోటల్ నడవదన్న ఉద్దేశంతో చేసేదిలేక అధిక ధర అయినా బ్లాక్‌లో కొందరు కొనుగోలు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ చేస్తే ఉపాధి కోల్పోతామన్న ఉద్దేశంతో యజమానులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో హోటల్ యజమానులు సమావేశమయ్యారు. గ్యాస్ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో స్మోక్‌లెస్ ఉడ్ స్టవ్‌లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
నో బుకింగ్
వివిధ గ్యాస్ కంపెనీల వారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తీసుకోవడం లేదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అలాగే గ్యాస్ కొరత ఏర్పడుతుందని ముందస్తుగా ఒకే సారి గృహవినియోగదారుల బుకింగ్‌లు పెరిగాయి. దీంతో గతంలో 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే వారు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద గ్యాస్ కొరత ఉందని వినియోగదారులు సహకరించాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో ఎల్‌పీజీ కొరత
అక్కడ యుద్ధం.. ఇక్కడ సంకటం
మూత దిశగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు
ఇదే అదనుగా బ్లాక్‌లో విక్రయాలు


