కోతుల నివారణకు రూ.5 కోట్లు కేటాయించండి
హుస్నాబాద్: పట్టణ అభివృద్ధి కోసం ప్రజలపై భారం పడకుండా అవసరమైన ఆదాయ వనరులు పెంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్ దండి లక్ష్మి అధ్యక్షతన వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సమక్షంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 21.88 కోట్ల అంచనా రాబడి, అంతే మొత్తంలో వ్యయంతో కూడిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, పాలకవర్గ సభ్యులు చేతులు పైకి ఎత్తి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బడ్జెట్ వివరాలను అకౌంటెంట్ హారతి చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వివిధ రకాలుగా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను స్థానిక పార్లమెంట్ సభ్యుడితో కలిసి తీసుకువస్తామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా, భవిష్యత్ తరాలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించేలా పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో ఒక ఇంటికి రెండు, మూడు నల్లా కనెక్షన్లు ఉన్నాయని ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని సరిచేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై సమావేశం నిర్వహించి నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బంజారాల అభివృద్ధికి కృషి
కోతులు, కుక్కలు, పందుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వివిధ పార్టీల నాయకులు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్య నియోజవర్గ వ్యాప్తంగా ఉందని, వాటి నివారణ కోసం రూ.5 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు. కోతుల వల్ల వరి పంట తప్ప వేరే పంటలు వేసే పరిస్థితి లేదన్నారు. కోతులు, కుక్కల దాడుల వల్ల వివిధ ఆస్పత్రులకు నెలకు 200 మంది చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. సమస్యలపై యుద్ధ ప్రాతిపదికను చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్, బీఎస్పీ, బీజేపీ, నాయకులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బత్తుల శంకర్ బాబు, వేణు గోపాల్‌రెడ్డి, అనంత స్వామి తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం
ఆదాయ వనరులుపెంచుకోవాలి: మంత్రి పొన్నం
వివిధ పార్టీల నాయకుల విన్నపం


